Aug 01,2022 21:39

ఆధార్‌ అనుసంధాన ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ :
ఓటర్‌ గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైనదని, ఈ ప్రక్రియకు వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ రాజకీయ పార్టీల నాయకులను కోరారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌తో కలిసి వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్‌ గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ చేసేందుకు బిఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యేక శిబిరాలు శని,ఆదివారాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారి నుంచి ఆధార్‌ సంఖ్యను సేకరించేందుకు కొత్తఫారం 6బి ప్రవేశపెట్టబడిందని ఓటరు కార్డ్‌కు ఆధార అనుసంధానం అనేది పూర్తి స్వచ్ఛందమని, ఆధార్‌ వివరాలు పూర్తి గోప్యతతో ఉంటాయని తెలిపారు. ఓటర్‌ జాబితా నుండి మల్టిపుల్‌ ఎంట్రీలు, డూప్లికేట్‌, రిపీట్‌, మరణించిన వారిని తొలగింపుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పూర్తి వెరిఫికేషన్‌ తప్పనిసరిగా చేసి జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. ఫారం-7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణ పత్రాన్ని జమచేయవలసి ఉంటుందన్నారు. నియోజకవర్గ పరిధిలోనే కాక ఇతర నియోజకవర్గాలకు ఓటర్‌ మార్పు, నూతన ఓటర్‌ గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు సంబంధించి ఫారం-8లోకి మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు సంబంధించి 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి కానున్నవారు ముందస్తుగా యువత దరఖాస్తు చేసుకొనే అవకాశంను భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబర్‌ ఒకటో తేదీలలో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రత్యేక ఫోటో ఓటర్ల జాబితా 2023 సవరణలు ఈనెల నాలుగు నుంచి అక్టోబర్‌ 24వరకు ఇంటింటి సర్వే, నవంబర్‌ 9న డ్రాఫ్ట్‌ రోల్‌ ప్రకటన, డిసెంబర్‌ 8 వరకు అభ్యర్థనలు, వాదనల పరిశీలన, 2023 జనవరి 5న ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో చిత్తూరు, కుప్పం ఆర్డీఓలు రేణుక, శివయ్య, జెడ్పిసీఈఓ ప్రభాకర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్‌, కాపు కార్పొరేషన్‌ ఈడీ సుబ్రహ్మణ్యం, రాజకీయ పార్టీల ప్రతినిధులు సిపిఎం- గంగరాజు, తెలుగు దేశం కోదండ యాదవ్‌, బహుజన సమాజ్‌ పార్టీ అశోక్‌కుమార్‌, సిపిఐ నాగరాజు, జనసేన దయారాం, బిజెపి జగదీశ్వర నాయుడు, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ డిప్యూటీ తహశీల్దారు పార్థసారథి, ఈడీటీలు, ఈఆర్‌ఓలు (ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌) ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఓటర్‌ కార్డుకు ఆధార్‌ కార్డు లింక్‌ చేయొద్దు..
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు వినతి
కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదనలతో ఓటర్‌ కార్డుకు ఆధార్‌ కార్డు లింక్‌ లింకు చేయాలని సోమవారం చిత్తూరు కలెక్టర్‌ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ ఆధార్‌ కార్డు విషయం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున దాన్ని ప్రస్తుతం లింకు చేయకూడదని సిపిఎం అభిప్రాయం తెలిపారు. అలాగే ఓటర్‌ గుర్తింపుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫోటో గుర్తింపు కార్డు, మరి ఇతర గుర్తింపు (డ్రైవింగ్‌లైసెన్స్‌, పాస్పోర్ట్‌ మొదలగునవి) కార్డులు పద్ధతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌ దష్టికి తీసుకెళ్లాలని కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.