Mar 20,2023 21:01

జిల్లా వ్యాప్తంగా సిఐటియు నేతలు, అంగన్వాడీల అరెస్టులు
600 మందికి నోటీసులు
పలుచోట్ల పోలీస్‌ స్టేషన్ల ఎదుట అంగన్‌వాడీల ఆందోళన
ప్రజాశక్తి - భీమవరం
ప్రభుత్వం మరోసారి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపునకు ఒడిగట్టింది. మహిళలని చూడకుండా ఉక్కుపాదం మోపింది. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చేపట్టిన చలో విజయవాడ మహాధర్నాకు అడుగడుగునా ఆంక్షలు విధించింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సిఐటియు నేతలు, అంగన్‌వాడీలు 600 మందిని అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. పోలీస్‌స్టేషన్ల ఎదుట ప్రత్యక్షంగా అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. భీమవరంలో రహదారిపై బైఠాయింపును పోలీసులు అడ్డుకుని వాగ్విదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఉద్యమాలపై నిర్బంధాలు విధించడం దారుణమని సిఐటియు ఖండించింది.
అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయో పరిమితి 50 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చలో విజయవాడ మహాధర్నకు పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వం అంగన్వాడీలను విజయవాడ వెళ్లనీకుండా అడ్డుకుంది. పోలీసులను ఉపయోగించి అడుగడుగునా నిర్బంధాన్ని విధించింది. సిఐటియు నేతలకు, అంగన్‌వాడీలకు ముందస్తు నోటీసులు జారీ చేయడంతో పాటు తెల్లవారుజాము నుంచే గృహ నిర్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 600 మందిని ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కాళ్ల, వీరవాసరం, పాలకొల్లు, మొగల్తూరు, గణపవరం, ఆకివీడు, పెనుగొండ, పెనుమంట్రతోపాటు అన్ని ప్రాంతాల్లో సిఐటియు నేతలు, అంగన్వాడీలను ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి నిర్బంధించారు.
మిన్నంటిన ఆందోళనలు..
ఎక్కడికక్కడ నిర్బంధంపై జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనలు మిన్నంటాయి. ఆయా పోలీస్‌ స్టేషన్ల వద్ద అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆకివీడు వంటి ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు.
రహదారిపై బైఠాయింపును అడ్డుకున్న పోలీసులు
విజయవాడ వెళ్లనీకుండా ప్రభుత్వం విధించిన నిర్బంధాన్ని నిరసిస్తూ భీమవరం ప్రకాశంచౌక్‌లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రహదారిపై బైఠాయిస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. అయితే అంగన్‌వాడీలంతా ఒక్కసారిగా రహదారిపై బైఠాయించడంతో పోలీసులు వారిని పైకి లేపే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జలుం నశించాలని, దౌర్జన్యాలు అరికట్టాలని నినాదాలు చేశారు.
నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు
విజయవాడ మహాధర్నాను అడ్డుకుని అంగన్‌వాడీలపై ప్రభుత్వం విధించిన నిర్బంధాన్ని అక్రమ అరెస్టులను సిఐటియు ఖండించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఎన్‌వి గోపాలన్‌, కె.రాజా రామ్మోహన్‌ రారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు. ఉద్యమాలను ఆపే ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, ఈ విషయాన్ని వైసిపి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
ఆకివీడు : అంగన్‌వాడీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఆకివీడు పోలీసులు కొంతమేర భగం చేశారు. సోమవారం ఉదయం 8:30లకు విజయవాడ వెళ్లేందుకు ఆకువీడు మండలానికి చెందిన అంగన్‌వాడీలే కాకుండా జిల్లా సరిహద్దులోని ఏలూరు జిల్లా కైకలూరు, కలిదిండి మండలాలు, పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల, ఉండి మండలాలకు చెందిన సుమారు 300 మంది ఆకివీడు రైల్వే స్టేషన్‌ చేరారు. అక్కడికి పోలీసులు చేరుకుని మోహరించినా సుమారు పాతిక మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు ఎక్కడికక్కడ రైలు ఎక్కేశారు. వారిని మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. తరువాత విడుదల చేశారు. సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు పి.అప్పారావు, కె.తవిటి నాయుడుకు నోటీసులిచ్చి వారిని గృహ నిర్బంధం చేశారు. మధ్యాహ్నం వారిని విడుదల చేశారు. తరువాత తవిటి నాయుడు, అప్పారావు పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని అంగన్‌వాడీలతో నిరసన తెలిపారు.
మొగల్తూరు : చలో విజయవాడ కార్యక్రమంలో అలంకార్‌ సెంటర్లో జరిగే ధర్నాకు అంగన్వాడీలు సోమవారం మండలంలోని గ్రామాల నుండి నరసాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు నిలుపుదల చేశారు. కాళీపట్నంలోని జాతీయ రహదారిపై అంగన్‌వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అంగన్వాడీల యూనియన్‌ అధ్యక్షురాలు మేడిది స్వర్ణలత మాట్లాడారు.
వీరవాసరం : అంగనవాడీలపై పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ వీరవాసరం బస్టాండ్‌ వద్ద సోమవారం అంగన్‌వాడీలు జాతీయ రహదారి పై బైఠాయించారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి ప్రభుత్వమే నిర్బంధాలు విధించి మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖిరి మార్చుకుని అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, శ్యాంబాబు, రెడ్డి రామారావు, లక్ష్మీపార్వతి, ఎస్తేరు, సుబ్బలక్ష్మీ పాల్గొన్నారు.
తణుకు రూరల్‌ : చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను తణుకు పట్టణ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయకుమారి పోలీస్‌ స్టేషన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. విజయవాడ ధర్నాకు వెళ్తుంటే మహిళలను అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చి నాలుగేళ్లయినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని, పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
చలో విజయవాడ వెళ్తుతున్న వారిని ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ప్రతాప్‌, కేతా గోపాలన్‌ తెలిపారు. పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల వద్ద అరెస్టులు చేసిన వారిని ప్రతాప్‌, గోపాలన్‌, అజయ కుమారి పరామర్శించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ జిఒ 1ని రద్దు చేయాలని, అంగన్‌వాడీి వర్కర్స్‌కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.
ఉండి : చలో విజయవాడకు వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ముందస్తు నోటీసులు అందించడం దారుణమని అంగన్‌వాడీలు చైతన్య, కుసుమ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.
ఆచంట:పోలీసులు నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని సిఐటియు మండల కార్యదర్శ వద్దిపర్తి అంజిబాబు అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరుతున్న అంగన్‌వాడీ వర్కర్లకు, సిఐటియు నాయకులను నోటీసులిచ్చి పోలీస్‌స్టేషన్లో సుమారు రెండు గంటల పాటు నిర్బంధించి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారి ఇళ్ల వద్దకు వెళ్లి అర్ధరాత్రి వేళ నోటీసులిచ్చి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
పెనుమంట్ర : అంగన్‌వాడీల సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న నేతలను సోమవారం పోలీసులు నిర్బంధించారు. ధర్నాకు వెళ్లేందుకు ఎటువంటి అనుమతులూ లేవని బ్రాహ్మణచెరువులోని సిఐటియు మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజుకు ఇంటి వద్ద పోలీసులు నోటీస్‌ ఇచ్చారు.
పాలకొల్లు : పాలకొల్లు, పోడూరు మండలాలకు చెందిన 40 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను విజయవాడ వెళ్లకుండా సోమవారం పాలకొల్లు రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, పోడూరు ప్రోజెక్ట్‌ ప్రధాన కార్యదర్శి పితల రాజమణి ఆధ్వర్యంలో సిఐ రాంబాబు వారిని విడుదల చేయించారు.
కాళ్ల : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడకు బయలుదేరుతున్న వర్కర్లను, సిఐటియు నాయకులను సోమవారం తెల్లవారుజామున కాళ్ల పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడం అన్యాయమని సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ విమర్శించారు. సోమవారం తెల్లవారుజామున సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణకు, అంగన్‌వాడీ నాయకురాలు దావులూరి మార్తమ్మ, అంగన్‌వాడీలకు ఎస్‌ఐ మూర్తి, పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.