Apr 16,2023 08:20

సెంట్రల్‌ యూనివర్సటీ నుంచి పాదయాత్రగా వస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులు

        బుక్కరాయసముద్రం : అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి అనేక హామీలను ఇచ్చిన బిజెపి నేతలు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని సిపిఎం, సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభిజన హామీలు అమలు, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద ఉన్న ఎపి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధుల విడుదల్లో కేంద్రం జాప్యాన్ని నిరసిస్తూ ప్రచారభేరి పాదయాత్రను శనివారం నాడు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టారు. జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ప్రారంభం అయిన పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వి.రాంభూపాల్‌, జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మోడీ, అమిత్‌ల నాయకత్వంలోని బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి ప్రజలమధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తోందన్నారు. పేదలను విస్మరించి అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం కరువుకాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంత అభివృద్ధికి విభజన చట్టం మేరకు అమలు చేయాల్సిన ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీకి 2015లో శంకుస్థాపన చేసి ఇప్పటికి కనీసం ప్రహరీ పూర్తి చేయని పరిస్థితి ఉదంటే బిజెపికి హామీల అమలుపై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, కడప ఉక్కు పరిశ్రమ, బెల్‌, నాసెన్‌ సంస్థలు, నిమ్స్‌ ఏర్పాటు, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇలా హామీలు అన్నింటినీ తుంగలో తొక్కారన్నారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ పదలపై మోయలేనంత భారాలు మోపుతోందన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. కులం, మతం విద్వేషం, పెత్తందారీతనం మనువాద శక్తుల ఆగడాలు పేట్రోగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో రాజ్యాంగానికి మూల స్తంభాలుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయంపై దాడి జరుగుతోందన్నారు. ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ పాలన సాగిస్తున్న బిజెపి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30వరకు జరిగే ప్రచారభేరి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, బాల రంగయ్య, నాయకులు ఆర్‌.కుల్లాయప్ప, ముస్కిన్‌, పుల్లయ్య, సంజీవరెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, మల్లికార్జున, నారాయణస్వామి, రమణ, అల్లీపీర, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.