1153 రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్ల నిరాకరణ
రైతుల అవస్థలు
ప్రజాశక్తి - వీరవాసరం
ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతన్న అడుగడుగునా దగాపడుతున్నాడు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి అన్ని విధాలా పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నాడు. తాను పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. ఒక పక్క పండించిన పంట నాణ్యతలేకపోవడం, మరో పక్క ప్రకృతి ప్రతికూల పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికితోడు అధికారులు, మిల్లర్లు సహకరించకపోవడంతో దాళ్వాలో చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక పక్క రైతులను అన్ని విధాలా ఆదుకుంటామంటూ ప్రభుత్వం భరోసా ఇస్తున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోంది. వ్యవసాయ క్షేత్రంలో టెక్నీషియన్‌తో ధాన్యం నాణ్యత నిర్థారించి మిల్లుకు తీసుకెళ్తున్నా అక్కడ నాణ్యత లేదంటూ ధాన్యం తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో గత్యంతరంలేని స్థితిలో మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సి వస్తోంది. బస్తాకు కొంత చొప్పున ధాన్యం తగ్గించడం లేదా బస్తాకు రూ.వంద నుండి రూ.200 నగదు చెల్లిస్తేనే ధాన్యం తీసుకుంటామంటూ మిల్లుల వద్ద ఖరాఖండిగా చెబుతున్నారని మత్స్యపురికి చెందిన రైతులు భాస్కరరావు, పోతుల సురేష్ వాపోయారు. ఇదిలాఉంటే ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఎకరం పంట కోయడానికి సుమారు నాలుగు గంటలు పడుతుందని, దీనికి అద్దె చెల్లించడానికి సుమారు రూ.5 వేలు అదనదంగా చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో దాళ్వాలో పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు మిగులుతున్నాయంటూ వాపోయారు.
వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం !
1153 రకం ధాన్యం నాణ్యత ఉండదని తెలిసి కూడా పంట కాల వ్యవధి తక్కువ కావడం, సాగు చివరి కాలంలో సాగునీటి కొరత నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనతో మత్స్యపురిలోని పలువురు రైతులు ఈ రకాన్నే సాగు చేశారు. అయితే సాగునీటి ఇబ్బందులేని ప్రాంతాల్లో కూడా 1153 రకాన్నే సాగు చేయడం గమనార్హం. ఈ రకంపై రైతులకు అవగాహన కలిగించడంలో వ్యవసాయాధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా మండలంలో అధిక శాతం 1153, 1156 రకాన్ని సాగు చేసిన రైతులు నేడు తమ పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్ ఉన్న రకాలను రైతులచే సాగు చేయించడంలో చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా సన్నద్ధం చేయాలని పలువురు కోరుతున్నారు.










