ప్రజాశక్తి - పాలకోడేరు
ఉపాధ్యాయ నేత, కళాకారుడు, వామపక్షవాది యల్లమిల్లి నరసింహమూర్తి ఆదర్శప్రాయులని పలువురు వక్తలు కొనియాడారు. నరసింహమూర్తి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేండ్ర గ్రామలో యుటిఎఫ్, కళాకారుల ఆధ్వర్యంలో నరసింహమూర్తి సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి చిత్రపటానికి ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు), సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఎన్‌వి.గోపాలన్, కె.రాజారామ్మోహన్‌రారు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. నరసింహమూర్తి ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ నేతగా, వామపక్షవాదిగా, నటుడిగా అనేక సేవలందించారని గుర్తు చేశారు. నరసింహమూర్తి తన కుటుంబాన్ని క్రమశిక్షణతో చక్కగా తీర్చిదిద్దారన్నారు. సమాజానికి తన వంతు సేవలందించారని చెప్పారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్ సేవా కేంద్రానికి నరసింహమూర్తి కుటుంబ సభ్యులు రూ.50 వేలు ఆర్థిక సహకారం అందించారని ప్రకటించారు. ముఖ్యఅతిథి ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు) మాట్లాడుతూ తన తండ్రి కీర్తిశేషులు సూర్యనారాయణరాజుతో నరసింహమూర్తి సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా, రాజకీయాల్లో అనేక సలహాలు నరసింహమూర్తి అందించారన్నారు. ప్రముఖ వైద్యులు దంపనబోయిన చలపతిరావు మాట్లాడుతూ నరసింహమూర్తి తనకు పెద్దఅన్నగా గ్రామంలో ఎన్నో సహాయ సహకారాలు అందించారన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకూ పోరాడారన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా నరసింహమూర్తి ఎంతోమంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు. ఉద్యమాల్లో అంకితభావంతో పని చేసి సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారని గుర్తు చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడుతూ యుటిఎఫ్‌లో నరసింహమూర్తి కీలకపాత్ర పోషించారన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం తపించారని, సమాజంలో రుగ్మతలు తొలగిపోవాలని కాంక్షించారని తెలిపారు. వీరవాసరం మాజీ ఎంపిపి వీరవల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ నరసింహముర్తి వద్ద తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయన మృతి బాధాకరమని అన్నారు. ప్రముఖ న్యాయవాది మల్లుల శ్రీనివాస్ మాట్లాడుతూ నరసింహమూర్తి గ్రామంలో దినపత్రిక చదివి దానిలో సారాంశాన్ని అందరికీ చెప్పేవారని గుర్తు చేశారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నరసింహమూర్తి సమాజం కోసం పాటుపడ్డారన్నారు. అన్యాయం సహించే వారు కాదన్నారు. సీనియర్ కళాకారుడు శ్రీశైలం మాట్లాడుతూ నరసింహమూర్తి తనకు ప్రాణ స్నేహితుడని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఇద్దరం కలిసి అనేక నాటకాలు వేశామన్నారు. నరసింహమూర్తి నాటకాలకు దర్శకత్వం వహించేవారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కడలి నాగేశ్వరి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్.విజయరామరాజు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పెద్దిరాజు, సిపిఎం మండల కార్యదర్శి అసిరియ్య, సీనియర్ నాయకులు తాడి రామారావు, నరసింహమూర్తి కుటుంబ సభ్యులు భార్య సత్యవతి, కుమారులు అచ్యుత సూర్య సుబ్రమణ్యం, వైఎస్‌ఎన్.మూర్తి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గొట్టుముక్కల రామలింగరాజు (మాస్టర్), గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, మాజీ ఎంపిపి పాలా వెంకటచలపతి నరసింహమూర్తి, కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.










