ప్రజాశక్తి - వి కోట : ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలోనే వి.కోటను ఉత్తమ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ పిఎన్ లక్ష్మి పేర్కొన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని వారు వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివద్ధి పథకాలకు తోడుగా జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యులు వెంకటే గౌడ, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సహకారంతో పంచాయతీ కార్యవర్గం సంక్షేమ అభివద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ పరిధిలోని పలు శ్మశానవాటికలను ఆధునీకరించి సరిహద్దులు నిర్ణయించి ప్రహరీగోడలు నిర్మిస్తామన్నారు. అంబేద్కర్ నగర్ సమీపంలోని శ్మశానవాటికలో ప్రత్యేకంగా శివుని విగ్రహాన్ని నెలకొల్పనున్నామని ఇప్పటికే ప్రజల మనోభావాలకు అనుగుణంగా సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రాబోవు నాలుగు సంవత్సరాల్లో మరింత మెరుగైన సేవలు అందించడం ద్వారా జాతీయస్థాయిలో ఆదర్శ పంచాయతీగా నిలిపేందుకు ప్రజలు సహకరించాలన్నారు .గ్రామ పంచాయితీ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్న వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఎన్ నాగరాజు కృషికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.










