ప్రజాశక్తి-అనంతపురం 2023-24వ సంవత్సరానికి అనంత వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగానికి జాతీయ వైద్య మండలి (నేషనల్ మెడికల్ కమిషన్) అదనంగా మరో ఏడు పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపల్ ఆరేపల్లి శ్రీదేవి తెలిపారు. ఈమేరకు అదనపు సీట్లు మంజూరు కావడం పట్ల మైక్రో బయాలజీ సిబ్బంది మంగళవారం మెడికల్ కళాశాలలోని ప్రిన్సిపల్ ఛాంబర్‌లో ప్రిన్సిపల్ శ్రీదేవిని కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు సీట్లు పెరగడంతో మొత్తం 11 పీజీ సీట్లు అవుతాయన్నారు. ఇన్ని పీజీ సీట్లు రావడంలో మైక్రోబయాలజీ విభాగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసిన బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విఆర్‌డిఎల్, ఎస్‌ఆర్‌ఎల్, వైరల్ లోడ్ సెంటర్, సిడి4, ఐసీటీసీ, పిపిటిసిటి, వైరల్ హెపటైటిస్ శాఖల సమన్వయ కృషి ఫలితమే అన్నారు. మైక్రో బయాలజీ సహాయ విభాగాధిపతి ఆర్.హైమావతి మాట్లాడుతూ రాష్ట్రంలో స్విమ్స్ ఆసుపత్రి తర్వాత కోవిడ్ పరీక్షలు నిర్వహించిన మొట్టమొదటి వైద్య కళాశాల అనంతపురం అన్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో హెచ్‌ఐవి వైరల్ లోడ్ శాతాన్ని నిర్ధారించే పిసిఆర్ పరీక్షలు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నాయన్నారు. ఎట్టకేలకూ ఏడు సీట్లు పెంచుతూ అనుమతి ఇవ్వడంతో మంత్రి విడుదల రజినికి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, వైద్య విద్య సంచాలకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైక్రో బయాలజీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్లు ఆర్.హైమావతి, వేముల సరోజ, మీనిగ శైలజ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, బసిరెడ్డి ప్రవీణ, ప్రియాంక, రత్న హారిక, ట్యూటర్లు సునీల్‌కుమార్, ఆదిరెడ్డి పరదేశీనాయుడు, సీనియర్ రెసిడెంట్లు లలిత భవాని, దివ్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు ఎల్లం నాయుడు, డైసీ, అభినయ, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆరేపల్లి శ్రీదేవికి బొకే అందజేస్తున్న మైక్రో బయాలజీ సిబ్బంది










