
* బోయ, వాల్మీకులను ఎస్‌టిల్లో చేర్చొద్దు
* ఆదివాసీ ఇయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సవర జగన్నాయకులు
ప్రజాశక్తి - పలాస: బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చి ఆదివాసీలకు అన్యాయం చేయొద్దని ఆలిండియా ఆదివాసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సవర జగన్నాయకులు అన్నారు. బోయ, వాల్మీకులను ఎస్‌టిల్లో చేర్చేందుకు వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో రెండోసారి తీర్మానం చేయడం ఆదివాసీలకు చీకటి రోజుగా అభివర్ణించారు. కాశీబుగ్గలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన బోయ, వాల్మీకులను ఎస్‌టిల్లో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఆయా కులాలను ఎస్‌టిల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తూ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ బెంతు ఒరియాలనూ ఎస్‌టి జాబితాలో చేర్చడం దారుణమన్నారు. అందరినీ ఇలా ఎస్‌టి జాబితాలో చేర్చుకుంటూ పోతే గిరిజన సంస్కృతి, సంప్రదాయలున్న ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పలాస నియోజకవర్గంలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారని, ఈ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివాసీలకు అండగా నిలవాలని కోరారు. సమావేశంలో ఆదివాసీ జెఎసి జిల్లా అధ్యక్షులు సవర రాంబాబు, పలాస నియోజకవర్గ అధ్యక్షులు పి.ఈశ్వరరావు, సభ్యులు మోహనరావు, సవర రామారావు తదితరులు పాల్గొన్నారు.