Jun 07,2023 22:34

జెఎన్‌టియు

         అనంతపురం ప్రతినిధి : విశ్వ సాంకేతిక విజ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయంలో చేపట్టిన భవన నిర్మాణం ఆది నుంచి లోపాలమయంగానే సాగుతూ వస్తోంది. అనంతపురం జెఎన్‌టియులో ఆడిటోరియం ఐదేళ్లు తిరగకుండానే పైకప్పు పోయి ప్లోరింగ్‌ కూడా దెబ్బతింది. ఇప్పుడు దీని మరమ్మతులకు మరో అర కోటి వరకు ఖర్చు కానుంది. విశ్వవిద్యాలయంకు సంబంధించిన పెద్ద కార్యక్రమాలేమైనా నిర్వహించేందుకు వీలుగా అనంతపురం జెఎన్‌టియులో 1100 మంది కూర్చేనా 99 టన్ను ఎసి సామర్థ్యంతో 2004లో రూ.10 కోట్లకుపైగా వ్యయంతో నిర్మాణాలు ప్రారంభించారు. దీని నిర్మాణాలు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు. నత్తనడకన నడుస్తూ వచ్చాయి. దీనిపై కాగ్‌ సైతం తాఖీదులిచ్చింది. అయితే అనేక ఆపసోపాల నడుమ దీని నిర్మాణాన్ని 2018లో పూర్తి చేశారు. దీనికి ఎన్టీఆర్‌ కళాక్షేత్రమన్న పేరునూ పెట్టారు. ఈ భవనం ప్రారంభమై సరిగ్గా ఐదేళ్లు కూడా గడవకనే ఇది దెబ్బతింది. మరమ్మతలు చేపడితేగాని కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. పైకప్పు దెబ్బతిని, నీళ్లు, దుమ్ము అంతా పడటంతో ప్లోరింగ్‌ కూడా దెబ్బతింది. ఇప్పుడు దీని మరమ్మతులకు రూ.54 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు టెండర్లు సైతం ఆహ్వానించారు. అయితే ఇవి పూర్తయి మరమ్మత్తులు చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చూడాల్సి ఉంది.
మరమ్మత్తులు కాకపోతే స్నాతకోత్సవం ఎలా ?
సాధారణంగా ఆగస్టు మాసంలో అనంతపురం జెఎన్‌టియులో స్నాతకోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని ఆడిటోరియంలోనే నిర్వహిస్తారు. ఎందుకంటే అనంతపురం నగరం పరిధిలో ఇంతటి ఏర్పాట్లతోనున్న మరో ఆడిటోరియం ఎక్కడా లేదు. ఈ ఒక్క చోటే 1100 మంది కూర్చేనే కెపాసిటీతో ఆడిటోరియం ఉంది. అయితే ఇప్పుడు దెబ్బతిన్న ఈ ఆడిటోరియం టెండర్లు పూర్తి చేసి మరమ్మతులు పూర్తి చేయడం ఈ రెండు మాసాల వ్యవధిలోపు సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది పూర్తవకపోతే ఎక్కడ స్నాతకోత్సవం నిర్వహిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందించే విశ్వవిద్యాలయంలోనే ఒక ప్రతిష్టాత్మక భవన నిర్మాణం ఈ రకంగా తక్కువ సమయంలో దెబ్బతినడం విమర్శలకు తావిస్తోంది.
టెండర్లు ఆహ్వానించాం
శశిధర్‌, రిజిస్ట్రారు,అనంతపురం జెఎన్‌టియు
జెఎన్‌టియు ఆడిటోరియం మరమ్మతులకు రూ.54 లక్షలతో టెండర్లు ఆహ్వానించాం. త్వరితగతిన పనులు ప్రారంభం కానున్నాయి. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం.