భవనాలను కూల్చేసిన రెవెన్యూ
వెనకుండి నడిపిస్తున్న హిందూత్వసంస్థ
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ఆ సంస్థ అధినేత నౌ'హీరా' దేశ విదేశాల్లో కమర్షియల్ బిజినెస్సులు ఉన్నప్పటికీ పేద ముస్లీం పిల్లలకు చదువు అందించాలనే ఉన్నతాశయంతో చంద్రగిరి సమీపంలోని తొడవాడ వద్ద హీరా విద్యాసంస్థలను పదేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అయితే ప్రారంభం నుంచి నేటి వరకూ హిందూ మతతత్వ శక్తులు 'హీరా' సామాజిక కార్యక్రమాలకు అడ్డుపడుతూనే వచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి హిందూ పరిరక్షణ సమితి నాయకులు 'హీరా' విద్యాసంస్థలపై కన్నేశారు. సంస్థ అధినేత నౌహీరా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తొండవాడ సమీపంలోని అగ్రహారం గ్రామస్తులు, రైతులు చెబుతూనే ఉన్నారు. కరోనా కాలంలో రెండో దశలో విపరీతమైన కేసులు ప్రబలడంతో చంద్రగిరి మండల వాసులకు సాయం అందించాలని ఎంఎల్‌ఎ చెవిరెడ్డి కోరగా విద్యాసంస్థలను కోవిడ్ సెంటర్‌గా మార్చి సేవలందించారు. కాల్వ పోరంబోకును రోడ్డుగా ప్రభుత్వమే చదును చేసింది. ప్రహరీ గోడ బయట మాత్రమే షెడ్డులు ఏర్పాటు చేశారు. కావాల్సిన ఖర్చంతా ప్రభుత్వంతో పాటు హీరా సంస్థ కూడా భరించింది. పేషంట్ల కోసం వేసిన ఈ రోడ్డును కేశవరెడ్డి విద్యాసంస్థలు ఉపయోగించుకుంది. తమ పొలం పక్కనే రోడ్డు వచ్చిందని అగ్రహారం రైతులు సంబరపడ్డారు. అయితే తిరుమల తిరుపతి హిందూ పరిరక్షణ సమితి నాయకుడు కాల్వ పోరంబోకును హీరా సంస్థ ఆక్రమించుకుందని ఇటీవల హైకోర్టుకెళ్లాడు. కాల్వ పోరంబోకని, ఆక్రమణను తొలగించాలని చంద్రగిరి తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం మండల తహశీల్దార్ శిరీష ఆధ్వర్యంలో కరోనా పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను, పక్కనే ఉన్న ప్రహరీని కూల్చేసింది. అటు పక్కనే రైతుల పంటను రెవెన్యూ అధికారులు జేసీబీతో తొక్కించారు. హీరా సంస్థ కోవిడ్ సందర్భంలో అందరికీ ఉపయోగపడిందని, అన్యాయంగా తమ భూములను, షెడ్డులను కూల్చేయడం బాధాకరమని రెవెన్యూ అధికారుల ముందు వాపోయారు. ఇటీవల కాలంలోనే గాంధీరోడ్డులో చైతన్య కాలేజీ పక్కనే హీరా జ్యూయలర్స్ షాపును బిజెపి నేతలు మూయించారు. అలాగే ప్రారంభంలో 'హీరా' కళాశాల తిరుమల కొండకు ప్రమాదమని ప్రచారం చేశారు.
కోర్టు ఆదేశాల మేరకే.. : శిరీష, తహశీల్దార్, చంద్రగిరి
హైకోర్టు ప్రజావ్యాజ్యం నేపథ్యంలో కోర్టు తీర్పు మేరకే తాము ఆక్రమణలను తొలగించాం. విధి నిర్వహణలో భాగంగానే కూల్చేశాం.










