Nov 13,2022 22:37

నీవానది పరీవాహక ప్రాంతాలలో పర్యటిస్తున్న నగర కమిషనర్‌

అడ్డంకులు తొలగించండి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
వర్షాలు నేపథ్యంలో నగరంలో ముందస్తు వరద నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం కమిషనర్‌ నీవా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించి వర్షాల పరిస్థితులను సమీక్షించారు. వీరభద్ర కాలనీ, ధర్మరాజుల గుడి ప్రాంతాల్లో నీవా నదిని పరిశీలించిన కమిషనర్‌ ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగం అధికారులకు మార్గం నిర్దేశం చేపట్టారు. ప్రధానంగా నీవానదిలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడిక మట్టి, కల్వర్టర్ల వద్ద వ్యర్థాలను జేసీబీలతో తొలగించే పనులను పరిశీలించారు. గహాల్లోకి నీరు ప్రవేశించకుండా కాలువలను శుభ్రం చేయించాలన్నారు. సంతపేటలిల్లీ వంతెన, ఇందిరానగర్‌, దోబీఘాట్‌ వద్ద నీటి ప్రవాహం పరిస్థితులను కమిషనర్‌ పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలపై నేపథ్యంలో ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగం నుంచి అత్యవసర బందాలు అన్నిసమయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, క్లోరినేషన్‌ కచ్చితంగా చేయాలన్నారు. లీకేజీలను నివారించాలని ఆదేశించారు. వార్డు కార్యదర్శులు సచివాలయాల పరిధిలో అందుబాటులో ఉంటూ వర్షాల పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈ ధనలక్ష్మీ, డీఈలు రమణ, వెంకటప్రసాద్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, లోకనాథ్‌, ఏఈలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.