Oct 09,2023 21:02

ఫొటో : మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య

అదానీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం దాసోహం
- సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అదానీ కంపెనీకి దాసోహమై విద్యుత్‌ ఛార్జీలను విపరీతంగా పెంచేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య ఆరోపించారు. సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్‌ క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రూ అప్‌ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, మెయింటనెన్స్‌ ఛార్జీల పేరుతో ఎప్పుడో 2014లో వాడుకున్న విద్యుత్‌కు ఇప్పుడు ఛార్జీలు వెయ్యడం బాధాకరమన్నారు.
స్మార్ట్‌ మీటర్ల రేటును భారీగా పెంచి అదానీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతుందని, బిజెపి పాలిత రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మీటర్‌ రేట్లు భారీగా ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి రాక ముందు ఒకలా, వచ్చాక మరోలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. విద్యుత్‌ ఉద్యమం చంద్రబాబును అధికారం నుండి దూరం చేసిందనేది వైసిపి ప్రభుత్వం మరచి పోకూడదన్నారు. రైతులకు కూడా మోటర్ల పేరుతో మీటర్లను ఏర్పాటు చేస్తూ నడ్డి విరుస్తుందన్నారు. నేటి నుండి 16వ తేదీ వరకు విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వామపక్షాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి కె.నాగరాజు, సిపిఐ జిల్లా రైతు నాయుకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.