- సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి-యలమంచిలి : మండలంలోని ఏనుగు వానిలంక పరిధిలో ఉన్న లంక భూముల్లో అక్రమ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చించినాడ అమరవీరుల స్మారక భవనం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ.. హౌసింగ్ జిల్లా అధికారులు, యలమంచిలి రెవెన్యూ అధికారులు ఇరువురు మట్టి మాఫియాతో చేతులు కలిపి, పేరుకు మాత్రం జగనన్న లేఅవుట్లు పూడికకు అని చెప్పి రూ. కోట్లాది రూపాయల విలువ గల ఇసుకను పక్కదారి పట్టించారని, ఈ క్రమంలో ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులకు ఇ క్కడి ఇసుకను తవ్వడానికి జిల్లా కలెక్టర్ అనుమతులు ఉన్నాయని దీనికి అడ్డొస్తే పోలీస్ ఫోర్స్ ను దింపి కేసులు పెడతామని చెప్పి బెదిరించి మరీ గోదావరి నది గర్భాన్ని ఆనుకొని వందలాది టిప్పర్లతో రెండు మూడు కోట్ల రూపాయలు విలువ గల ఇసుకను నెల రోజులుగా తవ్వేసారని, దీనిపై డి ఫారం పట్టా లంక భూముల డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో కోర్టు అడిగిన ప్రశ్నకు మైనింగ్ అధికారులు తాము ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని సమాధానం చెప్పడంతో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకపోయినా ఇసుకను తరలించారంటే.. ఎంతటి ఇసుక కుంభకోణం జరిగిందో.. అర్థమవుతుందని దీనిపై ప్రభుత్వం వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బాతిరెడ్డి జార్జి, మండల నాయకులు దేవ సుధాకర్, ఎడ్ల మోహన్ రావు, బాతిరెడ్డి సుగుణ, గొల్ల ఏడుకొండలు, రాజు తదితరులు పాల్గొన్నారు










