బుల్దానా (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. 21మందికిపైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముంబయి-నాగ్‌పుర్ హైవేపై రెండు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 21మందికిపైగా ప్రయాణీకులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ రెండు బస్సుల్లో ఓ బస్సు అమర్‌నాథ్ యాత్రికులతో వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండటం వలనో లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










