ప్రజాశక్తి - ఆచంట
నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు హామీలకే పరిమితమైంది. సార్వత్రిక ఎన్నికల సందర్భాల్లో నాయకులు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించి గెలుపొందారు. అనంతరం ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో ఏటా ఆస్తి, ప్రాణ నష్టం తప్పడం లేదు. ఆచంట నియోజకవర్గంలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని పాలకొల్లు పట్టణం నుంచి ఫైరింజన్ రావాల్సి వస్తోంది. తీరా ఫైరింజన్ ఇక్కడికి చేరుకునే సరికి అగ్నిప్రమాదం కారణంగా నష్టం జరిగిపోతోంది. సదరు బాధితులు భారీగా ఆస్తి నష్టపోతున్నారు. పలుమార్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. గోదావరి తీర ప్రాంతమైన ఆచంట నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు అత్యధికం. వీరిలో అధిక శాతం ప్రజలు తాటాకిల్లు, పెంకుటిళ్లల్లో నివాసముంటున్నారు. సుమారు 2 వేల కుటుంబాల వారు తాటాకిళ్లల్లో, 3 వేల కుటుంబాల వారు పెంకుటిళ్లల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి. నియోజకవర్గంలో గోదావరి మధ్య ఉన్న లంక గ్రామాలైన అయోధ్యలంక, పుచ్చలంక, కోడేరు, పల్లిపాలెం లంక గ్రామాల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. గోదావరి మధ్యన నివాసం ఉండే అయోధ్యలంక గ్రామాలకు ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో లంక గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే సర్వం కోల్పోవాల్సిందే. ఆస్తి, ప్రాణ నష్టాలు సంగతి అటు ఉంచితే ఒక్కోసారి పంటలు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి.
హామీల పర్వం..
ఆచంటలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు ఆనాటి ఎంఎల్‌ఎలు మోచర్ల జోహార్వతి, మాజీ మంత్రులు కొత్తపల్లి సుబ్బారాయుడు, పితాని సత్యనారాయణ, పీతల సుజాత హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.










