Oct 18,2023 21:00

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌

* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌
ప్రజాశక్తి - పోలాకి: 
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఇకనైనా అబద్దాలు కట్టిపెడితే మంచిదని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ హితవు పలికారు. మండలంలోని తలసముద్రంలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి 160 సీట్లు ఖాయమంటూ అచ్చెన్నాయుడు పెద్ద ఆశతోనే ఉన్నారని, అవి గాలిలో మేడలని తేటతెల్లం కానుందన్నారు. అవినీతికి పితామహుడు జగనే అంటూ ప్రేలాపనలు చేస్తున్న అచ్చెన్నాయుడు, చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చడానికే బురద చల్లుతున్నారని విమర్శించారు. రూ.45 వేల కోట్లు దోచేసిన వ్యక్తి జగన్‌ అంటూ ఎల్లో మీడియా ప్రచారాన్నే చిలకపలుకులుగా చెప్తూ మాయ చేయాలని చూస్తున్న అచ్చెన్న తీరు అందరికీ అర్థమవుతోందన్నారు. చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా జైలు గోడల మధ్యన ఉంటే దానికి, ప్రభుత్వానికి సంబంధమేంటని ప్రశ్నించారు. చంద్రబాబును సిఐడి అరెస్టు చేసిందని, ఈ కేసులో అంతకుముందే ఇడి, జిఎస్‌టి, ఆదాయపన్ను శాఖ విచారణ చేపట్టి అవినీతి జరిగిందని తేల్చిన తర్వాతే సిఐడి విచారణను చేపట్టిందని గుర్తుచేశారు. ఆ క్రమంలో సిఐడి చంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే, ఎసిబి న్యాయస్థానం రిమాండ్‌ విధించిందని తెలిపారు. ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా అరెస్టు చేశారంటున్న అచ్చెన్నకు బాబు కేసులు ఎసిబి కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్నాయని, అక్కడ విచారణ సాగుతోందన్నారు. ఏ ఆధారాల్లేకుండా బాబుని జైలులో ఎందుకు ఉంచుతారని ప్రశ్నించారు. ఎన్ని చేస్తున్నా బెయిల్‌ రాకపోవడానికి కారణాన్ని టిడిపి నాయకులు ఆలోచించాలని సూచించారు. వాస్తవాలు ఇలా ఉంటే, చంద్రబాబు మీద వైసిపి కక్ష అంటూ అచ్చెన్న, టిడిపి నేతలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పేదలకు మేలు చేసే ప్రభుత్వమని, ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగి నాయుడు, కణితి కృష్ణారావు, ఎంపిటిసి ప్రతినిధి బి.వైకుంఠరావు, వైసిపి నాయకులు ఆర్‌.త్రినాథరావు, చింతాడ ఉమ తదితరులు పాల్గొన్నారు.