బిజెపి ప్రభుత్వ తీరుపై ప్రచార భేరిలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - పాలకొల్లు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. ఆదివారం పాలకొల్లులో ప్రచార భేరిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్షాలైన టిడిపి, జనసేనలు కేంద్ర ప్రభుత్వం, మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అచ్చేదిన్ అంటూ ప్రచారం చేసి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ప్రజలకు సచ్చేదిన్ తీసుకొచ్చిందని విమర్శించారు. ధరలు, నిరుద్యోగం తగ్గిస్తామని చెప్పి వాటిని పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. రైతులు గిట్టుబాటు ధర కోసమే కాకుండా పంట అమ్ముకోవడానికి పోరాటం చేయాల్సిన దుస్థితి బిజెపి ప్రభుత్వ హయాంలో ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్, సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, నేతలు బాతిరెడ్డి జార్జి, వలవల శ్రీరామ్మూర్తి, దేవ సుధాకర్, మాచవరపు సుబ్బారావు, సుగుణ, రత్నంరాజు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: 'ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో ఆదివారం పట్టణంలో మూడోరోజు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి యాత్ర శివాలయం వీధి, జువ్వలపాలెం, రిక్షా పుంత, శ్రీదేవి పుంత, సవితృపేట, నరసింహారావుపేట, నవ్వారుపేట, తాళ్లముదునూరుపాడు వార్డుల్లో సాగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి కాపలాదారుగా ఉంటానని ఎన్నో మోసపూరిత మాటలు చెప్పి ప్రధాని మోడీ దేశాన్ని కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. కార్యక్రమంలో జవ్వాది శ్రీను, జవ్వాది శివ, శిద్దిరెడ్డి శేషుబాబు, చిట్టేటి సత్యనారాయణ, పోతు శ్రీను, అల్లం రాము, దాస్యం రాము, రావూరి బాబీ, సత్యనారాయణ పాల్గొన్నారు.
పాలకోడేరు: కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం, సిపిఐ చేపట్టిన రాజకీయ ప్రచారభేరి మండలంలో మూడో రోజు ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఆసిరియ్య, నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో పల్లెం భీమన్న, సుబ్బారావు, అప్పారావు పాల్గొన్నారు.
తణుకురూరల్: దేశ స్వాతంత్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోడీకి పాలించే అర్హత లేదని సిపిఎం, సిపిఐ నేతలు విమర్శించారు. ఆదివారం స్థానిక ఉండ్రాజవరం జంక్షన్, గణేష్ చౌక్, శివాలయం, మార్కెట్ ప్రాంతాల్లో రాజకీయ ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో కనీస పాత్ర లేని వారు దేశాన్ని పాలించడం సిగ్గుచేటన్నారు. ప్రజల కష్టాలు గురించి పట్టించుకోకుండా కేవలం మతం పేరుతో ప్రజలను చీల్చి అధికారంలోకి బిజెపి వచ్చిందన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, బి.కిషోర్, బి.మురళి, ఎన్.అప్పారావు, సిపిఎం నాయకులు గార రంగారావు, కామన మునిస్వామి, త్రిమూర్తులు, రమణ, సాంబశివరావు, సూరిబాబు పాల్గొన్నారు.
ఉండి: వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర బడ్జెట్లో ఆ రంగానికి మొండిచెయ్యి చూపారని సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం పాములపర్రు గ్రామంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు మోడీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కోత విధించిందన్నారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నక్కా వెంకటేశ్వర్లు, చిప్పాడ బుచ్చేశ్వరరావు, ఇర్రింకి శ్రీరామ్మూర్తి, చిన్నవీరప్ప, నాగేశ్వరరావు, పరశురామయ్య పాల్గొన్నారు.
పెంటపాడు: కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ప్రచార భేరి యాత్ర వాల్‌పోస్టర్‌ను ప్రజాసంఘాల కార్యాలయం వద్ద ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి కలింగ లక్ష్మణరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ మండలంలో 22 గ్రామాల్లో జీపు ప్రచార యాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు అతి కారుచౌకగా కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సాగే ప్రచార యాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, సత్తి కోదండరామిరెడ్డి, యండ్రపు కృష్ణ, పెనగంటి దుర్గ, బండారు శ్రీనివాసరావు, ఎస్.రాంబాబు, కొణతాల నాగరాజు, డి.సుబ్బారావు, ఉయ్యూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
గణపవరం: మోడీని సాగనంపకపోతే ప్రజల జీవితాలు మరింత దుర్భరమవుతాయని సిపిఎం మండల కార్యదర్శి పి.నరసింహమూర్తి అన్నారు. ప్రచారభేరి యాత్ర ఆదివారం కేశవరం చేరుకుంది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గ్రంధాలయం వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు నరాలశెట్టి రామకృష్ణ, సుబ్రమణ్యం, సంజీవరావు పాల్గొన్నారు.










