ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల 54,237, టీచర్ల 3,545 మంది ఓటర్లు
అభ్యంతరాలుంటే తెలపండి : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్లు, టీచర్ల ఓటర్ల జాబితాలను విడుదల చేయడం జరిగిందని అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చునని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆధార్ లింకేజీ మార్చి 31వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్రోల్మెంట్ అధికారిగా వ్యవహరిస్తున్న డిఆర్‌ఒ ఎన్.రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్‌ఎస్‌ఆర్ 2023 మేరకు ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 15లక్షల 43వేల 730 మంది ఉన్నారని, ఇందులో పురుషులు 7,65, 833 కాగా, మహిళలు 7,77,784 మంది ట్రాన్స్ జెండర్‌లు 113 మంది ఉన్నారని తెలిపారు. ప్రతి 1000 మంది పురుషులకు 1016 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా మహిళలు ఎక్కువగా నగిరిలో ఉన్నారని తక్కువగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫైనల్ జాబితా విడుదల చేయడం జరిగిందని, చిత్తూరు జిల్లాలో 54,237 మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోగా, టీచర్ల స్థానానికి సంబంధించి 3,545 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. మొత్తం ఎమ్మెల్సీ స్థానానికి గాను ప్రస్తుత ఆరు జిల్లాల పరిధిలో 383061 మంది, టీచర్ల స్థానానికి 26, 888 మంది ఓటర్లుగా నమోదు అయి ఉన్నారని ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లో వారీగా ఇప్పటికే జాబితాలు ఇవ్వడం జరిగిందని ప్రతి 14మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఇటీవల మార్పులు చేర్పుల్లో కొంత సంఖ్య పెరగడంతో ఈ ప్రతిపాదనలను తిరిగి పంపడం చేశామని తెలిపారు. ఆధార్ అప్డేషన్‌కు సంబంధించి మార్చి31 వరకు సమయం ఉందని ఈ కార్యక్రమం వేగవంతంగా చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆ విధంగా అందరూ కషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ వివరించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నామినేషన్ల రోజు వరకు స్వీకరించడం జరుగుతుందని, టీచర్ల ఓటు నమోదు కార్యక్రమంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చునని ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్, ప్రతి ఆర్డీవో కమిటీ మెంబర్లుగా ఉంటారన్నారు. జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌డిసి పర్వీన్, ఆర్డీవోలు శివయ్య, సజన ఇతర తహశీల్దార్లతో పాటు రాజకీయ పార్టీల నుంచి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగారాజు, బహుజన సమాజ్ పార్టీ నుంచి నాగరాజు, బిజెపి నుంచి రామభద్ర, సిపిఐ నుంచి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి పరదేశి, టిడిపి నుంచి సురేంద్ర కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మురుగేష్ లు పాల్గొన్నారు.
దొంగఓట్లను రద్దు చేయండి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో జరిగిన అవకతవకలపై నిర్దిష్టంగా పదేపదే సిపిఎం ఆధ్వర్యంలో ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ అధికారులు సమగ్ర సర్వే చేయకపోవడం సరైనది కాదని, వెంటనే అనర్హులను రద్దు చేయాలని శనివారం కలెక్టర్ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు 145 పోలింగ్ బూత్‌లో పిసిఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన దానిలో 834 మొత్తం ఓట్లు టీచర్లవి ఉంటే అందులో 150ఓటర్లు లేనివారికి ఇవ్వడం దారుణం అన్నారు. ఆధారాలతో సహా ఇచ్చిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒకపోలింగ్ బూత్‌లోనే ఇంతమంది ఉంటే జిల్లావ్యాప్తంగా ఎంతమంది ఉంటారో అని ప్రశ్నించారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మెమో ఆధారంగా ప్రైవేటు టీచర్లను మూడు సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.










