
ప్రజాశక్తి- బూర్జ: అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం మండలం నీలాదేవిపురం గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ సమస్యలు తెలుసుకొన్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను అక్కడే ఉన్న అధికారుల ద్వారా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలని, నవరత్న పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ప్రతి సచివాలయానికి ముఖ్యమంత్రి రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారని, ఆ గ్రామాల్లో డ్రైన్లు వంటి సమస్యలు విషయంలో పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో సర్కారీ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతోందని, తద్వారా పేద ప్రజలందరికీ నాణ్యమైన సత్వర వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు, టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపిపి బొడ్డేపల్లి సూర్యారావు, కరణం కృష్ణం నాయుడు, మండల పార్టీ కన్వీనర్ ఐ.వెంకటరావు, స్థానిక సర్పంచ్ జల్లు సిమ్మమ్మ, ఎంపిటిసి మజ్జి ధనలక్ష్మి, నాయకులు జల్లు ఆదినారాయణ, మజ్జి నర్సింగరావు, లావేటీ లక్షుం, కీర్తి శ్రీరాములు, శ్యాం సుందరరావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు