అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ (చేజర్ల) : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు తెలుపుతున్న సమస్యలకు సంబంధించిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చేజర్ల ఎంపిపి తూమాటి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపిపి తూమాటి అధ్యక్షతన తొలి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అజెండాలోని అంశాలను చదివి వినిపించారు. అనంతరం మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని, దాని ద్వారా పనులు మరింత వేగవంతమవుతాయన్నారు. నెలకో మారు నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలు అధికారులు గైర్హాజరైతే ఎలాగని, ఎటువంటి సమాచారం లేకుండా గైర్హాజరైన అధికారులపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని ఎంపిడిఒ విజయలలితను కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా నవంబర్ 2వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, మండలంలోని నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణ, జెడ్‌పిటిసి పీర్ల పార్థసారథి, వైస్ ఎంపిపి వేలూరు తిరుపతి నాయుడు, ముగ్గుముడి రఘురాంరెడ్డి, అన్నలూరు శ్రీనివాసులు నాయుడు, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు, మండల నాయుకులు పాల్గొన్నారు.










