ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి - నరసాపురం రూరల్
శ్మశానవాటిక, పార్కులు, రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ ముదునూరి.ప్రసాదరాజు అన్నారు. స్థానిక శాసన సభ్యుల కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు పట్టణ అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ ఛైర్ పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ జయరాజు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. ఏ ఒక్క వార్డులో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ప్రజలు, కౌన్సిలర్ల నుంచి ఏ ఒక్క ఫిర్యాదూ రాకూడదన్నారు. అవసరాన్ని బట్టి పారిశుధ్య కార్మికుల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా పారిశుధ్య కార్మికులు సరిగ్గా విధులు నిర్వహించకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలన్నారు. పనులకు నిధులు లోటు లేదన్నారు. మున్సిపాల్టీలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహణ జరగాలంటే ముందుగా డ్రెయినేజీలో పేర్కొన్న సిల్టును తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పందులు, కుక్కల స్వైర విహారాలు పూర్తిగా నియంత్రించాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.62 కోట్లు పట్టణంలో ఖర్చు చేయబోతున్నామని, టెండర్లకు పిలిచామని తెలిపారు. పురపాలక రెవెన్యూ ఆదాయం పెరిగేందుకు మెరుగైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పట్టణంలో విద్యుత్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. పట్టణ పరిధిలో గోదావరి వద్ద ఉన్న శ్మశానవాటిక అభివృద్ధికి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల నిధులతో ప్రహరీ గోడ, షెడ్, రహదారి నిర్మాణం తదితర అంశాలపై ఖర్చు చేశామన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైౖర్ పర్సన్ కామన నాగిని, మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు భూసరపు జయప్రకాష్ పాల్గొన్నారు.










