అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ కోరారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో పురోగతిపై శనివారం నగరపాలక కార్యాలయంలో సంబంధిత గుత్తేదారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ప్రత్యేకసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల కాలంలో టెండర్ల ద్వారా దక్కించుకున్న పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా అర్బన్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణపనుల్లో వేగం పెంచాలన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, మురుగునీటి కాలువల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయించాలన్నారు. ఇటీవల టెండర్ల ద్వారా దక్కించుకున్న పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాలని అన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీల్లో చేపడుతున్న నిర్మాణాలపై హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. కాలనీలో రోడ్లనిర్మాణాల పురోగతి పనులపై చర్చించారు. సమావేశంలో ఎంఈ ధనలక్ష్మీ, డీఈలు రమణ, వెంకట ప్రసాద్, హౌసింగ్ ఏఈ శ్రీధర్, గుత్తేదారులు పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ అరుణ










