
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - బూర్జ : అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సుమారు రూ.2.20 కోట్లతో కొల్లివలస నుంచి పాలకొండ వరకు ఆర్‌అండ్‌బి రహదారి అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వివరించారు. అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చిన ఏకైక సిఎం జగన్ అని కొనియాడారు. కుల, మత, ప్రాంత విభేదాలకు తావులేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడంతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. ప్రజల్లో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకొని ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలను అమలు చేస్తూ నాలుగేళ్లుగా ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, ఎంపిపి ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, టిడ్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, పిఎసిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, వైస్ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, డిసిఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.