ప్రజాశక్తి-తిరుపతి సిటి : సచివాలయం వ్యవస్థ ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించే దిశగా ''సచివాలయం బాట''కు శ్రీకారం చుట్టినట్లు తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పాడిపేట, ముళ్ళపూడి పంచాయతీలలో ''సచివాలయం బాట'' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండల పరిధిలోనే పాడిపేట, ముళ్ళపూడి పంచాయతీలలో అత్యధికంగా రూ.1.23 కోట్ల నిధులతో అభివద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. పంచాయతీలలో జరుగుతున్న పలు అభివద్ది పనులను మోహిత్ రెడ్డి పరిశీలించారు. రూ.40 లక్షలతో నిర్మితమైన గ్రామ సచివాలయం భవంతిని, రూ.21.50 లక్షలతో నిర్మాణ దశలో ఉన్న జగనన్న సమావేశ మందిరాన్ని, రూ.14 లక్షలతో నిర్మాణంలో ఉన్న గ్రంధాలయం నిర్మాణ పనులు, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను పర్యవేక్షించారు. పలు దశల్లో సాగుతున్న అభివద్ధి పనులు వెల్ నెస్ సెంటర్, గ్రామ వేదిక, యోగా ధ్యాన మందిరం, స్మశాన వాటికలో ఖర్మక్రియలకు నిర్వహణకు అవసరమైన షెడ్ నిర్మాణం గురించి ఇంజనీరింగ్ అధికారుల నుంచి ఆరా తీశారు. అన్ని విధాలా పంచాయతీ అభివద్ధి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో హాజరు పరట్టికను పరిశీలించారు. పాడిపేట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకట నారాయణ పాల్గొన్నారు.










