ప్రజాశక్తి నెల్లూరు :రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనకు కలెక్టర్లు ప్రత్యేక దష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి సుస్థిర అభివద్ధి లక్ష్యాలు- జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, ఆరోగ్యం, స్త్రీ, శిశు సంక్షేమం - ప్రభుత్వ పథకాలు, బాల్య వివాహాల నిరోధక చర్యలు, పాఠశాల విద్య, స్కిల్ డెవలప్మెంట్, హౌసింగ్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అమలు, మనబడి నాడు -నేడు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాలలో భాగంగా 10-19 వయస్సు గల పిల్లలకు, 15-49 వయస్సు గల గర్భిణులకు ప్రతి నెల వైద్య పరీక్షలు జరపాలన్నారు. కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుంచి కలెక్టర్ యం. హరి నారాయణన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, జిల్లా విద్య శాఖాధికారి గంగా భవాని, సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి, ఐసీడీఎస్ పిడి హేన సుజన హౌసింగ్ పిడి నాగరాజు, సిపిఓ రాజు, విద్యుత్ శాఖ ఎస్.ఈ విజయన్ పాల్గొన్నారు.










