అబ్దుల్‌కలాం సేవలు చిరస్మరణీయం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా డాక్టర్ ఎపిజె అబ్థుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వైసిపి నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఎపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆత్మకూరులోని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎరోనాటికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన అబ్దుల్ కలాం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వారి ఏరినాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో శాస్త్రవేత్తగా చేరి భారత సైన్యానికి చిన్న హెలికాఫ్టర్ చెయ్యడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారని తెలిపారు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరి ఇస్రో మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం తయారీలో పని చేశారని, ఇలా అనేక ప్రాజెక్టుల అభివృద్ధికి ఆయన పనిచేశారన్నారు. 1992లో ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహదారుగా, డిఆర్‌డిఒ ముఖ్యకార్యదర్శిగా పని చేశాడని, ఇదే సమయంలో జరిపిన ప్రోఖాన్ అణు పరీక్షలలో కలాం రాజకీయ, సాంకేతిక పాత్ర నిర్వహించాడని, ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయన్నారు. 2002 జూలై 18న కలాం బ్రహ్మాండమైన అధిక్యతతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారని, ఆయన ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందాడన్నారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సర్థార్, కౌన్సిలర్లు దగుమాటి శివారెడ్డి, చెరుకూరు కామాక్షయ్యనాయుడు, వైసిపి నాయకులు సయ్యద్ జమీర్ బాషా, కొప్పోలు చిన్నపరెడ్డి, కొండా చిన్న వెంకటేశ్వర్లు, మునీర్ తదితరులున్నారు.










