- కుందుర్పిలో ఘటన
ప్రజాశక్తి-కుందుర్పి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో జనం విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయంపై ఏకంగా అధికార వైసిపి జెండా ఎగిరింది. దాదాపు ఒకరోజంతా ఈ జెండా కార్యాలయంపై ఉంది. ప్రభుత్వ కార్యాలయంపై వైసిపి జెండా ఎగరడం ఏమిటంటూ పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పనా.? లేక ఎవరైన రాజకీయ ఉద్ధేశంతో చేశారా.? అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా మంత్రి ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కుందుర్పి మండల తహశీల్దార్ కార్యాలయంపై వైసిపి జెండా ప్రత్యక్షమైంది. సోమవారం ఉదయం అధికారులు గుర్తించి వెంటనే జెండాను తొలగించారు. అప్పటికే ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరల్ అయ్యింది. వైసిపి పాలనలో ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారంటూ కళ్యాణదుర్గం టిడిపి ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు మండిపడ్డారు.
- గుర్తు తెలియని వ్యక్తులు కట్టారు : తహశీల్దార్
ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జెండాను కట్టారని తహశీల్దార్ విజరుకుమారి తెలిపారు. తమ కార్యాలయ సిబ్బంది ఆదివారం మంత్రి ఉషశ్రీచరణ్ ఆధ్వర్యాన కళ్యాణదుర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారన్నారు. ఈ సమయంలో కొందరు ఆకతాయిలు తహశీల్దార్ కార్యాలయంపై జెండా కట్టారని తెలిపారు.










