Apr 25,2023 12:53

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం ను పురస్కరించుకుని అవగాహన ర్యాలీ, సదస్సును నిర్వహించారు. మలేరియా వ్యాధి ఆడ ఎనాఫీలస్‌ దోమ కుట్టడం వలన వస్తుంది కాబట్టి అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు దోమతెరలు తప్పనిసరిగా వాడాలని సూచించారు. విపరీతమైన చలి, జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలుంటాయని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష చేయించుకుని మలేరియా నిర్థారణ తరువాత 14 రోజుల చికిత్స తీసుకోవాలన్నారు. 15వ రోజు మళ్లీ రక్త పరీక్ష చేయించుకుని మలేరియా తగ్గిందీ లేనిదీ తెలుసుకోవాలన్నారు. జిల్లా మలేరియా విభాగం వాళ్ళు ప్రతి సంవత్సరం మలతీయన్‌ పొడి పిచికారి చేపట్టడం, పాజిటివ్‌ కేసులు వచ్చిన ఏరియాలో జాగ్రత్త చర్యలు చేపడతారని తెలిపారు. ప్రజలు వారికి సహకరించి ఇంట్లో ప్రతి గదిలో మలతీయన్‌ పొడి పిచికారి చేయించుకుంటే 6 నెలల వరకు దాని ప్రభావం ఉండి దోమలు రాకుండా ఉంటాయని చెప్పారు. ఇళ్ల కిటికీలకు మెస్‌ కట్టించుకోవడం, సాయంత్రం పూట వేపాకు పొగ వేసుకోవడం, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై పాటించి నీటి నిల్వలు తొలగించడం ద్వారా దోమల లార్వాలు పెరగకుండా చేసి అవి ఉత్పత్తి కాకుండా చేయవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దయాకర్‌, సబిహా సుల్తానా, సీహెచ్‌ ఓ.చంద్రావతి, ఎంపీహెచ్‌ ఈఓ నాగేశ్వరయ్య, మునాఫ్‌, సూపర్‌ వైజరు వెంకటరత్నమ్మ, ఓ.పి.సిబ్బంది, ఏఎన్‌ ఏం లు, తదితరులు పాల్గొన్నారు.