స్కూలు ప్రారంభానికి 10రోజులు ముందే విద్యా కానుక అందిస్తాం : అధికారి డి.మాధవిలత
ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక క్షేత్రస్థాయిలో పూర్తిగా అందేలా చూడాలని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయ పాఠ్యపుస్తక అభివృద్ధి అధికారిణి (స్టేట్ అబ్జర్వర్) డి మాధవిలత అన్నారు. బుధవారం జగనన్న విద్యా కానుక మండల స్థాయిలోని స్టోరేజీ పై సిఆర్పీ, పిటిఐ లకు భద్రతపై స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ... మండలంలోని సి ఆర్ పి , పి టి ఐ లు సమిష్టి కృషిచేసి విద్యా కానుక సామాగ్రిని విద్యార్థులకు పూర్తిగా అందించాలన్నారు. జిల్లాలోని 19 మండలాల్లోని 19 కేంద్రాల్లో స్టోరేజీలను పరిశీలించినట్లు తెలిపారు. గతంలో విద్యా కానుక అందించినట్లు కాకుండా, వచ్చే ఏడాది ప్రతి విద్యార్థికి బ్యాగు , దుస్తులు , పుస్తకాలు స్కూలు ప్రారంభానికి పది రోజులు ముందుగానే అందుబాటులో ఉంచుతామన్నారు . అంతేకాకుండా పాడైన విద్యా కానుకను విద్యార్థికి మార్పు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎకనామిక్ మోనిటరింగ్ ఆఫీసర్ (ఏఎంఓ) ఎంఎన్ శ్రీమన్నారాయణ , సీఎంఓ ఎ రామకోటేశ్వరరావు , ఎంఈఓ డి శారద జ్యోత్స్న , పెనుమంట్ర హైస్కూల్ హెచ్‌ఎం కె సాయి సూర్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.










