Jun 26,2023 15:04

ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమ గోదావరి) : మాదకద్రవ్యాల నిరోధకానికి కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ 'మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా' వ్యతిరేక దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జువ్వలపాలెం రోడ్డులోని బార్కస్‌ హోటల్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ప్రారంభించి మాట్లాడారు. జీవితం ఆనందమయం కావాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. దేశ భవితకు ఆయువుపట్టుగా, బలమైన శక్తిగా నిలవాల్సిన యువత ఆల్కహాల్‌, మాదక ద్రవ్యాల మత్తులో తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటోందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల చెరిగిన కలలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, ఆనందకరమైన జీవితానికి అవరోధంగా మారతాయి అన్నారు. ఎక్కడైనా డ్రగ్స్‌ వినియోగం చేసినట్లు చూస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.

2
  • మత్తు పదార్థాలు వినియోగించిన రవాణా చేసిన కఠిన చర్యలు : ఎస్‌పి రవి ప్రకాష్‌

నిషేధిత మత్తుపదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలనీ జిల్లా ఎస్‌పి రవి ప్రకాష్‌ అన్నారు. మాదకద్రవ్యాలు దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని, మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మారవద్దని తెలిపారు. డ్రగ్స్‌ వాడినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం హెరాయిన్‌, కొకైన్‌, గంజాయి, నాటు సారా లాంటి మత్తు పదార్థాలు వాడడంతో మనిషి మెదడుపై మత్తు ప్రభావంతో ఆలోచనా శక్తి నశించి యువత నేరాలు బాట పడుతున్నారన్నారు. కొందరు యువతని కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మాదకద్రవ్యాల నివారణకు జిల్లాలో ఎప్పటికప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, సమాచారం ఉన్నచోట్ల తనిఖీలు చేసి నిందితులను అరెస్టు చేసి కేసులు పెడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.ఈ.బి అడిషనల్‌ ఎస్పి ఎ.టి.వి రవికుమార్‌, డి.ఎం అండ్‌ హెచ్‌ ఓ డి. మహేశ్వరరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ చెరుకువాడ రంగ సాయి, వివిధ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొన్నారు.