ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : అంగన్వాడి వర్కర్స్ కు గత రెండు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ప్రజాశక్తి దినపత్రికతో ఆమె మాట్లాడుతూ ... చాలీచాలని వేతనాలతో బతుకుతున్న అంగన్వాడీలకు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం చాలా దారుణమన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1759 అంగన్వాడి కేంద్రాలు ఉండగా వీటిలో 3340 మంది కార్యకర్తలు పనిచేస్తుండగా మరో 89 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలకు మాత్రం సక్రమంగా వేతనాలు చెల్లించకపోగా ఒక వైపు ఫుడ్ కమిషనర్ వేధింపులు మరొక వైపు మెనూ ప్రకారం వండాలంటే నెలలు తరబడి బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే 2017 నుండి పెండింగ్ లో ఉన్న టి.ఏ బిల్లులు చెల్లింపులు జరగలేదన్నారు. ఒకటో తారీకుకి నాటికి ప్రతినెల వేతనాలు చెల్లిస్తానన్న ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. తక్షణం వేతనాలు చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా మినీ అంగన్వాడీ వర్కర్స్ కు వేసవి సెలవులు మంజూరు చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో అంగన్వాడి కేంద్రాలకు ఒంటి పూట సెలవులు ప్రభుత్వం మంజూరు చేసిందని జీఓ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రం నిర్వహించాల్సి ఉండగా సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యకర్తలను ఉండమని అధికారులు చెప్పడం సమంజసం కాదన్నారు.










