Jun 07,2023 15:45

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : ఆత్మకూరు మండల వ్యాప్తంగా వాలంటీర్లకు అవార్డుల అందజేత కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి వలంటీర్లకు సేవా వజ్ర, రత్న, మిత్ర అవార్డులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శమని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గ్రామ వలంటీర్లుపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. గడప గడపకు ద్వారా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు గ్రామ వలంటీర్లు అందిస్తున్న సేవల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమం పట్ల ప్రజలు అపూర్వ ఆదరణ చూపించారని ఇందులో వలంటీర్ల పాత్ర ఉందన్నారు. మరోవైపు టీడీపీ, ఎల్లో మీడియా, సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాటన్నింటినీ తిప్పి కొట్టాల్సిన బాధ్యత వలంటీర్లుపై ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బోయ గిరిజమ్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.