చిత్తూరు : ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి దోమల లార్వాలను గుర్తించి నాశనం చేయించాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ ఆదేశించారు. డెంగ్యూ జ్వరాలు, సీజనల్ వ్యాధుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం వద్దని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. కమిషనర్ డా.జె అరుణ శనివారం ఉదయం 14వ వార్డు పరిధిలో ప్రశాంత్ నగర్, ఎన్సీబీ కాలనీలో ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ఇళ్ళ ముందు ఉన్న నీటి తొట్టెల్లో దోమ లార్వాలు ఉండటంపై సంబంధించిన అధికారులు, ఆశ వర్కర్లు, వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన వారం నుంచి సీజనల్ వ్యాధులపై ఇంటికి వెళ్లి పరిశీలించాలని, ఫీవర్ సర్వే చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా... క్షేత్రస్థాయిలో ఇలా లార్వాలు ఎందుకు కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. నిల్వ చేసిన మంచినీటిలో డెంగ్యూ కారక దోమలు వఅద్ధి చెందుతాయనే విషయాన్ని స్థానికులకు అవగాహన కల్పించి, డ్రైడే పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం హౌసింగ్, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, నీటి సరఫరా, పన్నుల వసూళ్లు, సీజనల్ వ్యాధులపై అధికారులు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ శోభ, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నగరపాలక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్వో అనిల్ కుమార్, డీఈ వెంకట ప్రసాద్, ఏఈ శ్రీలత వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.










