ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం) : మండల పరిధిలోని అడదాకులపల్లి, మావటూరు గ్రామాలలో ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న , జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలు అనేక సమస్యలు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఎంత పని చేసిన కూలి గిట్టుబాటు రావడం లేదని , ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, చేసిన పనికి సకాలంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వేసవి అలవెన్స్ , పనిముట్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వమే ఉద్దేశ్య పూర్వకంగా కూలీలను పథకానికి దూరం చేయడానికి పూనుకున్నదని తెలిపారు. అందులో భాగంగానే బడ్జెట్‌లో కోతలు పెడుతోందని విమర్శించారు. కూలీలు ఐక్యంగా సంఘటితంగా పోరాడినప్పుడే ఉపాధి పథకం రక్షించ పడుతుందని తెలిపారు. రాబోయే కాలంలో సంఘం పిలుపులో పాల్గొనాలని నాయకులు ఉపాధి కార్మికులకు పిలుపునిచ్చారు.










