ప్రజాశక్తి-నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. నటుడు సూర్య జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌షాక్ తగిలి ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతిచెందారు. మృతులను నక్కా వెంకటేశ్, పోలూరు సాయిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మోపూరివారిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్, బాపట్ల జిల్లా జే పంగలూరుకు చెందిన పోలూరి సాయి తమ స్నేహితులతో కలిసి శనివారం రాత్రి నరసరావుపేటలో ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ అక్కడే పైనున్న విద్యుత్ తీగలకు తగలడంతో ఇద్దరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










