Oct 04,2022 21:18
  • విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతదేహంతో నిరసన

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల విద్యుద్ఘాతానికి గురై మంగళవారం ఇద్దరు యువరైతులు మృతి చెందారు. కూడేరు మండల పరిధిలో ఉదయాన్నే పొలం పనులకు వెళ్తున్న యువ రైతు రోడ్డుపై తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి విద్యుద్ఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ఉరవకొండ మండల పరిధిలో మరో యువ రైతు పొలంలో నీళ్ల మోటర్‌ స్విచ్‌ వేస్తూ విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... కూడేరు మండలం గొట్కూరు గ్రామానికి చెందిన రైతు బోయ కరుణాకర్‌ (24) మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో తన తోటకు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. అప్పటికే రోడ్డుపై పడి ఉన్న 11 కెవి విద్యుత్‌ తీగలను గమనించలేదు. దానిపైనే వెళ్లడంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విద్యుత్‌ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. కరుణాకర్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో బళ్లారి-అనంతపురం రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎప్పటికప్పుడు విద్యుత్‌ తీగలు తెగిపడుతున్నాయని విద్యుత్‌ అధికారులకు గతంలో సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదన్నారు. వారి నిర్లక్ష్యంతోనే కరుణాకర్‌ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఉరవకొండ మండలం నింబగల్లు నింబగల్లు గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు మారుతి(22) వారికున్న రెండెకరాల పొలంతో పాటు, మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేస్తున్నాడు. పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్‌ స్విచ్‌ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.