Sep 14,2023 15:46

హైదరాబాద్‌ : ఓ మహిళ 16 తులాల బంగారాన్ని ఆటోలో మరిచిపోయారు. బంగారం మిస్‌ అయిన విషయాన్ని గ్రహించిన మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు గంటల వ్యవధిలోనే గుర్తించి, రికవరీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేట మారుతీ నగర్‌కు చెందిన ఓ మహిళ తన తల్లితో కలిసి ఆటోలో ఎంజీబీఎస్‌కు బయల్దేరారు. అయితే ఆమె వద్ద ఉన్న 16 తులాల బంగారం బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. బస్టాండ్‌లోకి వెళ్లిన తర్వాత బ్యాగు కనిపించకపోయే సరికి అప్రమత్తమై మీర్‌చౌక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఆటోలోనే బంగారం బ్యాగును మరిచిపోయానని తెలిపింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఆటోను గుర్తించి, 16 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. అనంతరం ఆ బ్యాగును బాధితురాలికి పోలీసులు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే క్షణాల్లో స్పందించి, బంగారాన్ని రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.