May 23,2023 14:32

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ''శ్రీ సత్యసాయి, ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నీ'' మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎస్‌కే యూనివర్సిటీ మెయిన్‌ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌ను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎస్‌పి శ్రీనివాసరావు, ఎస్‌కెయూ వైస్‌చాన్సలర్‌ రామ కృష్ణారెడ్డి, ఆర్డిటి స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ''క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. స్నేహపూర్వం పెరుగుతుంది. క్రీడా నైపుణ్యం పెరుగుతుంది. 8 ఏళ్లుగా పలు సందర్భాల్లో క్రికెట్‌ టోర్నమెంట్‌లు నిర్వహించాం. ఈ టోర్నీలో మొత్తం 162 టీములు పాల్గొంటున్నాయి. ప్రిలిమనరీ పోటీలు రాప్తాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరుగుతాయి. సెమీఫైనల్‌, ఫైనల్‌ పోటీలు మాత్రం ఎస్కేయూ మైదానంలో జరుగుతాయి. శాంతిభద్రతల నియంత్రణ విషయంలో గట్టిగా పని చేసే ఎస్పీ శ్రీనివాసరావుకు ప్రత్యేక ధన్యవాదాలు. టోర్నీ విజేతకు ట్రోపితో పాటు లక్షా 20 వేలు, రన్నర్‌ జట్టుకు ట్రోపి, 60 వేల రూపాయలు, మూడోస్థానంలో నిలిచే జట్టుకు 30 వేల రూపాయలు, నాల్గో స్థానంలో నిలిచే జట్టుకు 15 వేల రూపాయలు అందజేస్తాం. అని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ టాస్‌ వేసి ఆకుతోటపల్లి - చిన్నంపల్లి జట్ల మధ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, మండల కన్వీనర్లు, ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, అనంతపురం రూరల్‌ మండలం అగ్రీ అడ్వజరి బోర్డు చైర్మన్‌ ఆలమూరు సుబ్బారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.