Apr 21,2023 12:54

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : టిడిపి హయాంలో వీఆర్‌ఏలకు రూ 10,500 నెలకు జీతం ఇస్తుండగా గత 4 సంవత్సరాల వైసిపి పాలనలో ఒక్క రూపాయి పెంచకపోవడం దారుణమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు వీఆర్‌ఏ సంఘం ఎమ్మెల్యే ను టిడిపి కార్యాలయంలో కలిసి తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ ... గత 4 సంవత్సరాలుగా ప్రజల జీవనవ్యయం దారుణంగా పెరిగిందని, అయినా వీరికి ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దారుణం అన్నారు. పైగా వీరిని ఉద్యోగులుగా గుర్తించడంతో రేషన్‌ కార్డు వంటి ప్రభుత్వ పథకాలు ఏవి వీరికి రావని దీంతో వీరు జీతభత్యాలు పెరగక నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పారు. వీరికి గతంలో డిఏ ఇవ్వగా దీనిని తిరిగి ఇమ్మని రివర్స్‌ పాలన చేస్తున్న జగన్‌ కోరడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వీఆర్‌ఏల సమస్యల పరిష్కరించకపోతే తదుపరి వచ్చే టిడిపి పాలనలో వీరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీఆర్‌ఏల కనీస వేతనం 26,000 కు పెంచాలని నిమ్మల డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం డివిజన్‌ వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు మోటూరి మోషే ,పాలకొల్లు మండల అధ్యక్ష ,కార్యదర్శులు టి గోవిందరావు, టి వెంకటేశ్వరరావు డి నాగేశ్వరరావు, ఎన్‌ తాతారావు, పెచ్చెట్టి ఏడుకొండలు , పెచ్చెట్టి నరసింహమూర్తి పాల్గొన్నారు.