- ప్రచారబేరిలో సిపిఐ, సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-నగరి(చిత్తూరుజిల్లా) : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజావ్యతిరేక బిజెపిని సాగనంపాలని సిపిఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్యా పిలుపునిచ్చారు. సోమవారం నగరి మున్సిపాలిటీలోని 10 వార్డులో సిపిఎం, సిపిఐ ప్రచార బేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండయ్య మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 14 నుంచి 30వ తేదీ వరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించ తలపెట్టిన ప్రచార భేరి యాత్రలో భాగంగా కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందన్నారు. ప్రజా ధనంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని.. కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా,నిధులు ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలను గాలికి వదిలేసి, కడపలో ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పకుండా కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తున్నదన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా కుదించి వారి హక్కులను హరిస్తున్నదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి 32 మంది యువకుల ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపాలని వారు కోరారు. కార్యక్రమంలో సిపిఐ నగరి కార్యవర్గ సభ్యులు బాషా, విజయ కుమార్, రుప్ కుమార్, మురళి, సిపిఎం కార్యదర్శి పెరుమాళ్, ఏఐటియుసి నాయకులు మణి, నందకుమర్ తదితరులు పాల్గొన్నారు.










