కుప్పం (చిత్తూరు) : పుంగనూరు దాడి ఘటనకు నిరసనగా ... నేడు వైసిపి బంద్‌కు పిలుపునిచ్చిన వేళ ... చిత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. కుప్పంలో వైసిపి అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. నిరసనలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బస్సు పాక్షికంగా దెబ్బతింది. 40 మందితో కుప్పం డిపో బస్సు కృష్ణగిరి నుంచి తిరుమలకు వెళుతుండగా, ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సులో ఉన్న తమిళనాడుకు చెందిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై శనివారం ఉదయం వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోనే గడిపారు. బంద్ పిలుపులో భాగంగా ... చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఆగిపోయాయి. ముందస్తు ప్రకటన లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బంద్‌ను పాటించాలంటూ... వైసిపి శ్రేణులు కుప్పంలో దుకాణాలను మూసివేయిస్తున్నారు.










