- అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి
ప్రజాశక్తి-అనంతపురం క్రైం: ఆకతాయిలపై నిఘా వేసి ఈవ్ టీజింగ్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి ఆదేశించారు. బుధవారం నగరంలో నా భూమి -నా దేశం హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్ ర్యాలీ స్థానిక తెలుగు తల్లి కూడలి వద్ద ముగిసింది. ఈ సందర్భంగా డీఐజీ దిశ పెట్రోలింగ్ బృందాలతో మాట్లాడారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిఘా వేసి ఆకతాయిల భరతం పట్టాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు వదిలే సమయంలో రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ జరగకుండా ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ నియంత్రించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో విజిబుల్ గా ఉండడం వల్ల ఈవ్ టీజింగ్, తదితరాలు జరగకుండా ప్రివెంట్ చేసినట్లవుతుందన్నారు. దిశ యాప్, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న కూడళ్లలో స్కూలు పిల్లలు ఇబ్బంది పడకుండా సురక్షితంగా దాటించాలన్నారు. కార్యక్రమంలో డీఐజీతో పాటు జిల్లా ఎస్‌పి కె.శ్రీనివాసరావు, అదనపు ఎస్‌పిలు ఆర్.విజయభాస్కర్ రెడ్డి, ఎం.హనుమంతు, దిశ డీఎస్పీ ఆంథోనప్ప తదితరులు పాల్గొన్నారు.










