May 11,2023 16:00

ప్రజాశక్తి-వీకోట(చిత్తూరు) : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నామని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని బైరుపల్లి సచివాలయం పరిధిలోని పెదరాంపల్లి, బైరుపల్లి గ్రామాల్లో రెండో రోజు ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమంలో భాగంగా మీ గడప వద్దకే మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులుతో కలిసి వారు నిర్వహించారు. ఈ సందర్భంగా 291 గృహాలను సందర్శించి వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న అభివృద్ధి పథకాలను అడిగి తెలుసుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాముగానిపల్లె రోడ్డు నుండి బైరుపల్లె వరకు సిమెంటు రోడ్డుకి కేవలం ఎన్నికలకి రెండు నెలల ముందుకు శంకుస్థాపన చేసి గాలికి వదలివేస్తే నేడు అదే రోడ్డు 1.3కిలో మీటర్ల మేర ఒక రూ.కోటి 30 లక్షలతో నిర్మాణం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారన్నారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా, అమ్మ ఒడి తదితర పథకాలు మహిళలకు వరంగా మారాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే వైఎస్‌ జగనన్నకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్‌ పలమనేర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హేమంత్‌ కుమార్‌ రెడ్డి, సింగల్‌ విండో అధ్యక్షులు శ్రీరాములు రెడ్డి, సర్పంచ్‌ నీలమ్మ, ఎంపీటీసీ సభ్యులు మురుగేష్‌, స్థానిక నేతలు ఇంద్రేష్‌, శంకర్‌ రెడ్డి, నాగరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.