ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమగోదావరి) : డివైఎఫ్‌ఐ, ఐద్వా సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కలిదిండి సూర్యనారాయణ రాజు జన విజ్ఞాన కళా వేదిక వద్ద మే 5 వ తేదీ నుంచి 15 వరకు వేసవి వినోదం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక యూత్ కన్వీనర్ చింతపల్లి మావో తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పొలమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ అవరణలో ప్రధానోపాధ్యాయులు బండి ఆంజనేయులు చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతపల్లి మావో మాట్లాడుతూ.. బడి పిల్లలకు వేసవి సెలవుల్లో విజ్ఞానం, వినోదం కూడిన కృత్యాలతో వేసవి వినోదం కార్యక్రమం జన విజ్ఞాన వేదిక రూపొందించినట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడం, అంతులేని సిలబస్, అర్థంలేని పరీక్ష విధానాలు వల్ల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యారని అన్నారు. స్మార్ట్ ఫోన్‌లకు అలవాటు పడి విద్యార్థుల్లో సృజనాత్మకత తగ్గిపోయి యూసర్లుగా మిగిలిపోతున్నారన్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి జన విజ్ఞాన వేదిక వేసవి వినోదం నిర్వహించిన, సరికొత్త ఆలోచనలతో పిల్లల్లో దాగి ఉన్న అంతర్గత నైపుణ్యాలను బయటకు తీసి వారికి చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేలా వివిధ అంశాలను జోడించి ఈ సంవత్సరం వేసవినోదం రూపొందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 9 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలబాలికలు ఈ కార్యక్రమానికి అర్హులని , ఈ వేసవి వినోదంలో ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం, ఓరిగామి, గణితంలో మెలకువలు, సైన్స్ ప్రయోగాలు, మ్యాజిక్, మట్టి బొమ్మలు వంటివి నేర్పుతారని అన్నారు . ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు ప్రమోద్ , భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.










