- జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
ప్రజాశక్తి-వికోట : ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, జగనన్న కాలనీలలో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కలెక్టర్ సగిలి షన్మోహన్ ఆదేశించారు. వి.కోట మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం వారు పరిశీలించారు. వీకోట గ్రామపంచాయతీ పాపేపల్లి సమీపంలోని జగనన్న లేఅవుట్‌లో ఇండ్ల నిర్మాణాలను, నాణ్యతను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలన్నారు. నిర్ణీత కాలవ్యవధి లోపల ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అడ్వాన్స్ నగదు చెల్లింపు ద్వారా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. గడువు లోపు ఇల్లు నిర్మాణాలు ప్రారంభించని లబ్దిదారుల ఇండ్లను, ఇంటి పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని ఈ విషయం లబ్ధిదారులకు తెలియజేయాలని అధికారులు ఆదేశించారు. కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తిగా ప్రభుత్వమే చేపడుతుందని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. లేఅవుట్ పరిధిలోని గ్రామపంచాయతీ డంపింగ్ యార్డ్ స్థలాన్ని వారంలోపు ప్రత్యామ్నాయ స్థలానికి మార్పు చేయాలని తాసిల్దారును ఆదేశించారు. అనంతరం బంగ్లా ఊరు సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఓగు సమీపంలో ఆర్ బి కే భవనాలను పరిశీలించారు. ఓగు సచివాలయంలో సిబ్బందితో సమావేశమై జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నుండి ఉచితంగా 11 రకాల ధ్రువపత్రాలు ఉచితంగా పొందే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి ,వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని ఆదేశించారు. వీరి వెంట ఎంపీపీ యువరాజ్ , వైస్ ఎంపీపీ తమీంఖాన్ , ఎమ్మార్వో చిట్టిబాబు ,హౌసింగ్ అధికారులు ,రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










