చంద్రబాబు నాయుడు పై రాళ్ల దాడి అధికార పార్టీ దౌర్జన్యానికి పరాకాష్ట : టిడిపి నాయకురాలు సవితమ్మ
ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం) : జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ సిఎం చంద్రబాబు నాయుడు పై రాళ్ల దాడి అధికార పార్టీ దౌర్జన్యానికి పరాకాష్ట అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శనివారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ .... ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వారుపై వైసీపీ రౌడీమూకల దాడి పిరికిపంద చర్య అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకే అల్లర్లకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర అభివఅద్ధిని, మరచి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పర్యటనలను అడ్డుకోవడమే సరిపోయిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ సభలకు వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోందని అందుకే ఎర్రగొండపాలెంలో చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఇదంతా వివేకా హత్య కేసు డైవర్ట్ చేయడానికే వైసీపీ డైవర్ట్ రాజకీయాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. మంత్రి సురేష్ బాధ్యత మరచి వీధి రౌడీలా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. వైసిపి ప్రభుత్వం దళితులపై దాడులు చేసినప్పుడు మంత్రి సురేష్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మంత్రి సురేష్ ని వెంటనే మంత్రి పదవి నుండి గవర్నర్ భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడులు జరుగుతాయని పోలీసులకు ముందే తెలిసినా పట్టించుకోలేదని, చంద్రబాబు భద్రతా సిబ్బందికి గాయాలు తగలడం పోలీసుల వైఫల్యమే అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టూరు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, మాజీ వైస్ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి, దాదు, ఫయాజ్ సనావుళ్ళ, తదితరులు పాల్గొన్నారు.










