Jul 14,2023 13:19

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు) : మండలంలోని పచ్చికాపల్లం నుండి ఎస్‌ఆర్‌ పురం మండలంలోని కొత్తపల్లి మిట్ట వరకు ఉన్న ప్రధాన రహదారిని విస్తరింప చేయాలని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి ఆర్‌ అండ్‌ బి ఇంజనీరింగ్‌ చీఫ్‌ ఇనయతుల్లా నుకోరి వినతిపత్రం సమర్పించినట్లు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గ స్థానిక నాయకులతో కలిసి అమరావతిలో ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి ఆర్‌ అండ్‌ బి అధికారులతో పచ్చికాపలం నుండి కొత్తపల్లి మిట్ట రోడ్డు విస్తరణ పై చర్చించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. సుమారు 28 కిలోమీటర్ల మేర ఈరోడ్డు ఇరువైపులా ఇరుకుగా ఉండడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పినట్లు తెలిపారు. రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యలన్నీ అధికారులకు గుర్తు చేసినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. ఎంతోకాలంగా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఈ రోడ్డు మాత్రం విస్తీర్ణకు నోచుకోలేదని ఆర్‌ అండ్‌ బి అధికారులకు వినతి పత్రం ద్వారా సమర్పించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. వెంటనే ఈ రోడ్డుకు రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసి డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన ఆర్‌ అండ్‌ బి అధికారులు పచ్చికాపలం నుండి కొత్తపల్లి మిట్ట రోడ్డు వరకు తక్షణ మరమ్మతుల నిమిత్తం రూ.8 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు త్వరలో మరమ్మతు పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. రోడ్డు పూర్తిస్థాయిలో మరమతులకు గురి కావడంతో రెన్యువల్‌ కింద బాగు చేయడం కోసం ఎనిమిది కోట్లు రూపాయల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారని మంత్రి చెప్పారు. డబుల్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి దఅష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు ఆర్‌ అండ్‌ బి చీఫ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ రోడ్డును బాగు చేస్తే నియోజకవర్గంలోనే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని ఉపముఖ్యమంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెంటనే రోడ్డుకు మహర్దశ వస్తుందని అధికారులు హామీ ఇచ్చారని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నియోజకవర్గ బూత్‌ కమిటీ కన్వీనర్‌ బోడి రెడ్డి నారాయణరెడ్డి, పాలసముద్రం, పెనుమూరు, మండలాల వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.