చెట్టపట్టాల్ పట్టుకుని/ దేశస్తులందరు నడువ వలెనోయ్/ అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నియు మెలగవలెనోయ్ ! స్వాతంత్య్ర పోరాటానికి ముందు వంగ దేశంలో అంకురించిన సాంస్కృతిక పునర్వికాసంతో ప్రత్యక్ష సంబంధం గల గురజాడ మహాకవి రాసిన దేశభక్తి గీతంలోని ఈ చరణాలు నాటి భారతీయ సంస్కర్తలు, మేధావుల ఆకాంక్షనే గాక ఆలోచనా రీతిని తెలియజేస్తాయి. వందలాది మతాలు, జాతులు, భాషలు గల ఈ దేశం కలసికట్టుగానే ముందుకు సాగాలని వారు స్పష్టంగా గుర్తించారు.
సామాన్యుల నుంచి సామ్రాట్టుల వరకూ ప్రగాఢమైన మత విశ్వాసాలు ఎప్పుడూ వున్నాయి. వాటి ప్రభావమూ వుంది. వందల రాజ్యాలతో కూడిన ఈ దేశం అశోకుడి నుంచి అక్బర్ వరకూ అనేక రాజ్యాలుగా నడిచింది, యూరప్‌లో జరిగినట్టుగా ఇక్కడ మత యుద్ధాలు మాత్రం జరగలేదు. దిగువ స్థాయిలో ప్రజానీకం మత సామరస్యంతో మెలిగేవారు. ఒకరి దేవతలను ఒకరు పూజించడం దగ్గరనుంచి ఒకరి వేడుకలలో మరొకరు పాలుపంచుకునే సంప్రదాయాలు ఇప్పటికీ చూస్తాం. తిరుపతి వెంకన్న బీబీ నాంచారిని వివాహమాడాడని విశ్వాసం. కబీర్ రాముడిని కీర్తిస్తూ వచనాలు రాశాడు. షిర్డి సాయిబాబాను అందరూ పూజిస్తారు. తిరణాలలో ఉరుసు వేడుకల్లో అందరూ పాల్గొంటారు. మసీదులకు హిందువులు గుళ్లకు ముస్లింలు వస్తారు. క్రైస్తవం కూడా ఎవరైనా స్వీకరిస్తారు. మిషనరీల బళ్లకు వెళతారు.
బ్రిటిష్ వారి పాలన ఈ పరిస్థితిని తలకిందులు చేసింది. పాలనా ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం సామాజ్య్రవాదం బాగా రాటుదేలింది. 1817లో జేమ్స్ మిల్ రాసిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో దేశ చరిత్రను హిందూ యుగం ముస్లిం యుగం అని విభజించడంలో ఈ వ్యూహం ప్రారంభమైంది, అయినా మరో అర్థ శతాబ్దం తర్వాత 1857లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ప్రజ్వరిల్లింది. మొదటిసారిగా పోరాటంలో మత భేదాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్కు తదితర రాజులు, సైనికులు కూడా పాల్గొన్నారు. దాంతో తమ విభజించి పాలించే విధానాన్ని మరింత తీవ్రం చేయాలని బ్రిటిష్ పాలకులు గ్రహించారు.
బ్రిటిష్‌వారు తొలి దశలో కాంగ్రెస్ ముందుకు తెచ్చిన కోర్కెలను పట్టించుకోలేదుగాని ముస్లిం మత చాందసుల కోర్కెలను వెంటనే అంగీకరించారు. 1909, 1919లలో మతాలవారీ ప్రత్యేక నియోజక వర్గాలు తెచ్చారు. మరోవైపున జాతీయ నాయకులైన తిలక్ వంటి వారు కూడా గణేష్ పూజ, శివాజీ ఉత్సవాల వంటివి తమ పోరాటానికి సాధనాలుగా చేసుకున్నారు. గాంధీజీ జీవితమంతా రామనామ స్మరణ చేస్తూనే వున్నా ఈశ్వర్ అల్లా తేరేనాం అన్నారు. 1920లలో ఆయన స్వతంత్ర పోరాటంలో తొలి ప్రధాన పిలుపు ఖిలాఫత,్ నిజానికి టర్కీలో ఖలీఫాను బ్రిటిష్‌వారు కూలదోసినందుకు వ్యతిరేకంగా ఉద్దేశించింది. అలీ సోదరులు దాన్ని స్వాగతించారు. అది హిందూ ముస్లింల మధ్య ఐక్యత మరింత పెంచింది. జిన్నా, మౌలానా ఆజాద్ వంటివారు స్వాతంత్రోద్యమంలో భాగస్వాములయ్యారు. వాస్తవానికి జిన్నానే దాన్ని వ్యతిరేకించారు. అయితే 1930లలో బిటిష్‌వారు కమ్యూనల్ అవార్డుతో మత భేదాలు పెంచడానికి
మరో ప్రయత్నం చేశారు. గాంధీ అంబేద్కర్ మధ్య పూనా ఒడంబడికతో అదీ పరిష్కారమైంది. ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు తదితరుల నాయకత్వంలో ఐక్యంగానే పోరాడారు. ముజఫర్ అహ్మద్, మౌలానా షౌకత్ వంటి వారు కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు చొరవ తీసుకున్నారు తప్ప మత మార్గం పట్టలేదు.
1920 పుట్టుకతోనే సంపూర్ణ స్వతంత్రం నినాదమిచ్చిన కమ్యూనిస్టు పార్టీ కులమత భేదాలకు అతీతంగా వివిధ తరగతుల శ్రమజీవులను రైతు కూలీలను సమీకరించింది. అదే సమయంలో ఏర్పడిన ఆరెస్సెస్ బ్రిటిష్ వారికన్నా మొఘల్ పాలకులే ప్రధాన శత్రువులన్నట్టు ప్రచారం చేసినా ప్రజాదరణ పొందలేకపోయింది. 1937లో దానికి పరాకాష్టగా దామోదర్ సావర్కార్ ద్విజాతి సిద్ధాంతం తేవడం, గోల్వాల్కర్ హిట్లర్ తరహా ఆర్యజాతి ఆధిక్యత సిద్ధాంతం తేవడం జరిగినా ప్రజలు ఐక్యంగానే వున్నారు. కాని ఆ తర్వాత జిన్నా కూడా ప్రత్యేక పాకిస్తాన్ కావాలని రాజకీయ నినాదమెత్తుకున్నాడు. ప్రజా పోరాటాల ఫలితంగా పలాయనం చిత్తగించేందుకు సిద్ధమైన బ్రిటిష్ పాలకులు దేశాన్ని విభజించి స్వాతంత్య్రం ప్రకటించారు. విశేషమేమంటే ముస్లింలలో అత్యధికులు పాకిస్తాన్ వెళ్లకుండా ఇండియానే తమ దేశంగా ఎంచుకుని మతశక్తుల, సామ్రాజ్యవాదుల కుట్రను విఫలం చేశారు. ఆ సమయంలో ఇరువైపులా ఘోరమైన మత కలహాలు రెచ్చగొట్టినా విశాల జన బాహుళ్యం ఒకరికొకరు సహకరించుకుని గొప్ప మానవత ప్రదర్శించారు. మహాత్మా గాంధీ ఆ పరిస్థితుల్లో కూడా ప్రజల మధ్య పర్యటిస్తూ సామరస్యం కాపాడ టానికి కృషి చేశారు. స్వాతంత్ర వేడుకలలో పాల్గొన కుండా నౌఖాలి లో సుదీర్ఘ సత్యాగ్రహం చేశారు. కుటిల శక్తుల పన్నాగాలను వమ్ము చేస్తూ భారతదేశం లౌకిక మార్గం ఎన్నుకో వడానికి వెనక ఈ మత సామరస్య సంప్రదాయమే వుంది. ఆ గాంధీని సావర్కార్ శిష్యుడైన గాడ్సే స్వతంత్రం వచ్చాక ఆరు నెలల్లో హత్య చేసినప్పు డు మతాలకు అతీతంగా దేశం విషాదంలో మునిగిపోయింది. స్వాతంత్య్రానంతరం కూడా ఈ శక్తులు మతతత్వం పెంచేందుకు కుట్రలు సాగిస్తున్నా విశాల జన బాహుళ్యం సామరస్య స్ఫూర్తినే కోరుకుంటున్నారు. కులమతాలకతీతంగా కలిసిమెలసి నడిపించిన జాతీయోద్యమ స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయం.










