Mar 06,2023 08:16

''భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయననిధి యని చెప్పబడిన భాష''
అని విశ్వనాథ సత్యనారాయణ గారు అటు రాయలను, ఇటు తెలుగు భాషను ప్రశంసించారు. అలాంటి తెలుగు భాషలో ఆ రాయల వారే రాసిన అద్భుత ప్రబంధం ఆముక్తమాల్యద. ఈ గ్రంథరాజం దుర్గమ వనాంతర్గతమైన ఓ మధుర ఫలం. దానిని పొందడానికి వేదం వెంకటరాయ శాస్త్రి వేసిన మార్గం సంజీవని వ్యాఖ్య. దానికి తుమ్మపూడి కోటేశ్వరరావు గారి సౌందర్య లహరి వ్యాఖ్య ఆ మార్గాన్ని మరికొద్దిగా వెడల్పు చేసినది. 21వ శతాబ్దపు నూతన బా(పా)టసారులకు ఆ మధుర ఫలాన్ని సులువుగా అందుకోవడానికి వారిద్దరూ వేసిన ఆ మార్గాన్ని మరింత కంటక రహితం చేసిన పుస్తకమే ఈ రాయరత్న మంజూష. దీని రచయిత గార రంగనాథం. ఈయన ఉద్యోగ విరమణ చేసిన తెలుగు పండితుడు. ఒక విశ్రాంత ఉద్యోగి పిల్లలు, వాళ్ళ సంపాదనలు, వాళ్లసెటిల్మెంట్స్‌... ఇవన్నీ బాగుంటే భజనలు చేసుకుంటోనో, భక్తులు గానో మారి రోజులను దొర్లించుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్న రోజులు ఇవి. కానీ ఈయన మాత్రం ఉద్యోగ విరమణ తర్వాత 'రాజాం రచయితల వేదిక' అనే సాహిత్య సంస్థను స్థాపించి, ప్రతి నెల నిర్విఘ్నంగా ఒక సాహిత్య సమావేశం ఏర్పాటు చేసి, విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలో సాహిత్య వాసనలను వెద జల్లిస్తున్నారు. సంస్థ నిర్వహణనే కాకుండా, తాను కూడా సాహిత్య, సామాజిక, చారిత్రిక అంశాలపై పరిశోధన గావించి పద్యమో, కవితో, కధో, వ్యాసమో రాస్తూ, తన సామాజిక రుణాన్ని తీర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రాస్తున్న క్రమంలో తన పేరుకు సంబంధి అయిన కావ్యం, సాహితీ సమరాంగణ చక్రవర్తి కృష్ణ రాయలు రాసిన ప్రబంధ రాజం ఆముక్తమాల్యదపై దృష్టిపడి, నాలుగేళ్ల పాటు తీవ్రమైన పరిశోధన చేసి, అందులో ఉన్న సామాజిక, సాహిత్య అంశాలను ఒక కొత్త ఎఱుకతో 30 వ్యాసాలుగా రాశారు. ఆ వ్యాసాల విలువనెరింగి, గుంటూరు వాస్తవ్యులు బొమ్మిడాల కష్ణమూర్తి తన సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ముద్రణ చేయించారు.
          ''ఆముక్తమాల్యద అంటే అందరికీ భయమే మీకు మాత్రం చాలా చనువు ఏర్పడింది'' అంటారు బేతవోలు వారు వారి ముందుమాటలో ఈ రచయిత గురించి. నారికేళ ఫలపాకమైన ఈ ప్రబంధంలో సామాజిక, సాహిత్య విషయాలను వెలికి తీసి, వ్యాసరత్నాలుగా ఈ మంజూషలో పెట్టి, దానిని రాయ రత్న మంజూష అను పేరుతో సరళమైన సాహిత్య లోకానికి అందించారు రంగనాథం. ఈ మంజూష తెరవడానికి లబ్ద ప్రతిష్టులైన కె.శ్రీనివాస్‌ 'కృష్ణరాయ ద్వాత్రంశిక' పేరుతోనూ, బేతవోలు రామ బ్రహ్మం 'అభినందన' పేరుతోనూ, మేడూరి సూర్య సత్యనారాయణ మూర్తి 'మంజూషలో చిరంజీవి' పేరుతోనూ ముందు మాటలు అందించారు.
            ''లోక వృత్త జ్ఞానము, శాస్త్ర పాండితి, శబ్ద జ్ఞానము, చందస్సు, నిఘంటు, స్మ ృతి, పురాణ, ఇతిహాసాగమ, తర్క నాట్యార్థ కామ యోగాది గ్రంథములయు, కాళిదాసాది కవుల కావ్యములయు తత్వమున ఎత్తును అడుగును తాకిన పరిచయము, వ్యుత్పత్తి, అభ్యాసము చేతను నిండు సంస్కారం పొందినట్టిది రాయని ప్రతిభ. ఇందులకు ఆముక్తలో ప్రతి వాక్యమును, ప్రతి పదమును తార్కాణమే.'' ఆముక్తమాల్యదకు ఉపోద్ఘాతము రాస్తూ నేలటూరి రామదాసు అయ్యంగార్‌ రాసిన మాటలివి. వాటినన్నిటిని ఈ మంజూషలో వ్యాసాలు నిరూపించాయి. అందులో కథను క్రమానుగతంగా అందించిన వ్యాసాలు, వర్ణనలో భాగంగా రాయలు ప్రకృతిని పరిశీలించిన విధానాన్ని వివరించిన వ్యాసాలు, మత చర్చను లేపిన వ్యాసాలు, ఆనాటి సాంఘిక జీవితాన్ని పరిశీలించిన వ్యాసాలు, ముఖ్యంగా 'కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి' అన్న నానుడిని నిజం చేశాడా అన్నట్టు రాయలు ఆనాటి రైతు జీవితాన్ని వర్ణించిన తీరు, రైతుకు రాయలు ఇచ్చిన ప్రాధాన్యతను వివరించిన 'రైతు జీవితం' వ్యాసం, ఆనాటి సాంప్రదాయాలు, రాయలకున్న శాస్త్రజ్ఞానం, రాయల రచనావైచిత్రి, ఆయన పద ప్రయోగం, ముఖ్యంగా ఠిన్గణా అన్న ఒక్క పదంపై ఒక వ్యాసమంతటి చర్చ, సంగోరు, జాలి, గరగ మొదలగు జానపదుల పదాలను కావ్యంలో వాడటం, ఉత్ప్రేక్షాలంకారంపై రాయలకున్న మక్కువను నిరూపించడం, ఆముక్తమాల్యద ఆధారంగా రాయల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం, అశ్వాసాంత పద్యాల ఆధారంగా రాయలు చేసిన యుద్ధాలను వరస క్రమంలో వివరించడం, రాయలు తెలుగు వాడే అన్న విషయాన్ని రూఢపీరచడానికి తనకున్న పారామీటర్స్‌ను ఉపయోగించి నిరూపించడం, అలాగే వేదం వారి సంజీవని వ్యాఖ్యలో ఉన్న కొన్ని అసంగతాలను వినయపూర్వకంగానే విన్నవించడం, 'రాయలు తాను చూడనిది ఏదీ రాయలేదు. చూచినదంతా కవిత్వీకరించాడు.'' అని తీర్మానించి రాయలు రాసిన ప్రతి కోణాన్ని నిశితంగా పరిశీలించి, మంచి పరిశోధనాత్మక వ్యాసాలను ఈ పుస్తకం ద్వారా మనకు అందించారు రంగనాథం.
       అలాగే తనకు స్పష్టత లేని విషయాలను, స్పష్టత ఉన్న వారితో చర్చించి నిర్ణయించడం ఉదాహరణకు 'గోసంగి' పదవిషయంలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారితో చర్చించి సరైన అర్ధాన్ని మనకు అందించారు. కొన్ని అంశాలను రైతు రాయలు పుస్తకం వెలువరించిన గుత్తి చంద్ర శేఖర రెడ్డి గారితో చర్చించడం చూస్తే, రచయిత ఎటువంటి ఆభిజాత్యానికి పోకుండా సరైన విషయాలను రూఢ పరుచుకొని అందించడానికి ప్రయత్నం చేశారు. పచ్చని పట్టు బొంతపై సువర్ణ ఖడ్గాన్ని పక్కనపెట్టి, ఘంటాన్ని చేతబట్టి లేఖకుడిగా ఉన్న రాయల వారి చిత్రం ముఖచిత్రం గా ఉన్న ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం ప్రారంభంలోనూ, కొన్ని వ్యాసాల చివరన ఖాళీగా ఉన్నచోట 38 అందమైన చిత్రాలను ముద్రించారు. అందులో 26 బొమ్మలు రాయల సంబంధి దేవాలయాల్లో ఉన్న ప్రతిమలకు ఫొటోలు. ఇందులో 17 వివిధ ప్రదేశాల్లో ఉన్న రాయల శిలా ప్రతిమలే. 12 బొమ్మలు ప్రసిద్ధ చిత్రకారులైన బాపు, అంట్యాకుల పైడిరాజుల గీతల్లో వచ్చిన చిత్రాలు. ఇంత అందంగా అర్థవంతంగా ఉన్న ఈ రాయరత్న మంజుషను ఎంతో శ్రమకోర్చి మనకు అందించిన రచయిత అభినందనీయులు.. ఇది సాహిత్య అభిమానులందరి స్వీయ గ్రంథాలయంలో తప్పక చేరాల్సిన పుస్తకం. ఈ పుస్తకం ధర రూ.300, రచయిత మొబైల్‌ నెం. 98857 58123.
 

- ఆల్తి మోహనరావు,
99638 95636