ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : పేదల గుండె చప్పుడు రాహుల్ గాంధీ అని పీసీసీ సభ్యులు పోటుగారి భాస్కర్ అన్నారు. వెదురుకుప్పంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ ... నిత్యం పేదల బాగోగుల గురించి ఆలోచిస్తూ పార్లమెంట్ లో సమయం దొరికినప్పుడల్లా పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, బడాబాబుల రుణమాఫీ పై ప్రజాస్వామ్యబద్దంగా కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతున్న రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన గొంతు నొక్కి అవమానపరచడం అప్రజాస్వామికం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత బిజెపి ప్రభుత్వం దేశంలోని విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, పోర్టులు, ఉక్కు కర్మాగారాలు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అదానికి అప్పజెప్పి చోద్యం చూస్తున్నారన్నారు. దేశాన్ని మొత్తం గుజరాతీలే పరిపాలించే స్థాయికి మోడి వ్యూహరచన చేశారన్నారు. రాహుల్ గాంధీకి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అనర్హత వేటువేయడం, ఇప్పటికిప్పుడు తన నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం చూస్తుంటే రాహుల్ ను చూసి మోడి ఎందుకు భయపడుతున్నారో అర్థమవుతుందన్నారు. దేశంలో పేద ప్రజల తరపున పోరాటం చేయడం తప్పా ? అని ప్రశ్నించారు.










